యూనిఫాం సివిల్ కోడ్‌కు ఆప్ మద్దతు..

Update: 2023-06-28 13:28 GMT

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ యూనిఫాం సివిల్ కోడ్‌ కు సూత్రప్రాయ మద్దతును ప్రకటించింది. ఉమ్మడి పౌర స్మృతితో ముడిపడిన సైద్ధాంతిక వైఖరికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆప్ నేత సందీప్ పాఠక్ వెల్లడించారు. "రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా యూనిఫాం సివిల్ కోడ్ ఉండాలని చెబుతోంది. అయితే దాన్ని అమలు చేయడానికి ముందు అన్ని మతాలు, రాజకీయ పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయం సాధించాలి" అని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇలాంటి అంశాలను తెరపైకి తేవడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అలవాటుగా మారిందని సందీప్ ఆరోపించారు.

"యూనిఫాం సివిల్ కోడ్‌‌ను అమలు చేయాలన్న ఆసక్తి బీజేపీకి లేదు. దేశ ప్రజల మధ్య విభజనను, గందరగోళాన్ని సృష్టించి.. ఆ తర్వాత ఎన్నికలకు పోవాలనే ప్లాన్‌లో కమల దళం కనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు. గత తొమ్మిదేళ్లలో ప్రధాని మోడీ సర్కారు చేసిన అభివృద్ధి ఏదీ లేదని.. అందుకే ఉమ్మడి పౌర స్మృతిని అడ్డు పెట్టుకొని ఎలక్షన్లకు వస్తున్నారని విమర్శించారు. కాగా, యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రధాని మోడీ చేసిన తాజా వ్యాఖ్యలు విభజన రాజకీయాల్లో భాగమని కాంగ్రెస్, డీఎంకే, ఏఐఎంఐఎం సహా అనేక పార్టీలు ఆరోపించాయి.


Similar News