ఈ ఆంత్రోపాలజిస్ట్‌ని ఇండియాలోకి అనుమతించట్లేదు.. ఇందుకేనా?!
ప్రశ్నించినా, పరిశోధించినా అధికారంలో ఉన్నోళ్లకి నచ్చదు. Anthropologist Filippo Osella, UK Denied Entry Into India
దిశ, వెబ్‌డెస్క్ః ప్రశ్నించినా, పరిశోధించినా అధికారంలో ఉన్నోళ్లకి అస్సలు నచ్చదు. అందులోనూ, క్షేత్రస్థాయి నిజాలను బయటకు తీస్తుంటే వారికి కట్టడి తప్పదు. ఇలాంటి సమస్యే వచ్చిపడిందేమో గానీ ఓ ప్రఖ్యాత ఆంత్రోపాలజిస్ట్‌ను ఇండియాలోకి అడుగుపెట్టనీయడం లేదు. ప్రస్తుతం కేరళలో సాంప్రదాయ చేపల వేటపై పరిశోధన చేస్తున్న యూకే మానవ శాస్త్రవేత్తకు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఆంత్రోపాలజిస్ట్, విద్యావేత్త అయిన ఫిలిప్పో ఒసెల్లా గురువారం తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే భారతదేశం అతన్ని దేశంలోకి రానీయకుండా బహిష్కరించింది. ఈ ఆదేశాలు ఎవరి నుండి, ఎప్పుడు వచ్చాయో మాత్రం బయటపెట్టలేదు. "ఒసెల్లా ప్రవేశం లేదు" అని కేరళ విమానాశ్రయంలోని విదేశీయుల రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)లోని ఒక అత్యున్నత ఇమ్మిగ్రేషన్ అధికారి వెల్లడించారు. అయితే, దీనిపై మరిన్ని వివరాలు చెప్పకపోవడం విశేషం. ఒసెల్లా కేరళలోని తీర ప్రాంత కమ్యూనిటీల సదస్సులో పాల్గొనేందుకు భారతదేశానికి వచ్చినట్లు తెలుస్తోంది.
యూనివర్శిటీ ఆఫ్ సస్సెక్స్‌లో ఆంత్రోపాలజీ, దక్షిణాసియా స్టడీస్ ప్రొఫెసర్‌గా ఉన్న ఒసెల్లా గత కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ కేరళపై పరిశోధనలు చేస్తున్నారు. గతంలో కేరళలో అంటరానివారి జీవితాల స్థిరీకరణ, గుర్తింపు, సామాజిక చలనశీలతపై రెండు ఉమ్మడి మోనోగ్రాఫ్‌లను ప్రచురించారు (కేరళలో సోషల్ మొబిలిటీ, 2000). అలాగే, మగవారిపై 'దక్షిణ భారతదేశంలో పురుషులు, పురుషత్వం, 2007' అనే పరిశోధన కూడా ప్రచురించారు. ఇక ఆయన ప్రస్తుతం 'కోజికోడ్, అనేక గల్ఫ్ దేశాలలో దక్షిణ భారత ముస్లింల సమకాలీన పరివర్తన' గురించి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు.