అద్భుతం సృష్టించిన 11 ఏళ్ల చిన్నారి.. నెట్టింట్లో ప్రశంసల వర్షం
అతిచిన్న వయస్సులో కేరళకు చెందిన ఓ చిన్నారి అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఐఫోన్ సాయంతో కంటి వ్యాధులను గుర్తించే ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) బేస్డ్ యాప్‌ను రూపొందించి రికార్డు సృష్టించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: అతిచిన్న వయస్సులో కేరళకు చెందిన ఓ చిన్నారి అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఐఫోన్ సాయంతో కంటి వ్యాధులను గుర్తించే ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) బేస్డ్ యాప్‌ను రూపొందించి రికార్డు సృష్టించింది. 11ఏళ్ల లీనా రఫీక్ అనే కేరళకు చెందిన సెల్ఫ్ కోడర్, తన ఆవిష్కరణను లింక్డ్‌ఇన్ ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. రఫీక్ ఈ అప్లికేషన్‌కు 'Ogler EyeScan' అని పేరు పెట్టింది. వీడియోలో తన అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో కూడా వివరించింది. ఆమె అభివృద్ధి చేసిన యాప్‌తో ఆర్కస్, మెలనోమా, టెరీజియం, క్యాటరాక్ట్ వంటి కంటి వ్యాధులను గుర్తించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
10 ఏళ్ల వయసులోనే 'ఓగ్లర్ ఐ స్కాన్' అనే యాప్‌లో పనిచేయడం ప్రారంభించానన్నారు. కంప్యూటర్ విజన్, అల్గారిథమ్‌లు, మెషిన్ లెర్నింగ్ మోడల్స్, ఐ కండిషన్స్, యాపిల్ ఐఓఎస్‌లోని అధునాతన టెక్నాలజీతో సహా వివిధ విషయాలను అర్థం చేసుకుని, తనకు ఈ యాప్ రూపొందించడానికి దాదాపు 6 నెలల సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత యాప్‌ను ఆప్ స్టోర్‌లో సబ్మిట్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం లీనా షేర్ చేసిన ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సమాజానికి ప్రయోజనకరమైన యాప్‌ను క్రియేట్ చేసినందుకు చిన్నారిపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘వావ్, అద్భుతంగా ఉంది! మీరు Ogler EyeScanని సృష్టించినందుకు అభినందనలు’అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.