ట్రేడింగ్‌లో రూ.9 కోట్లు పోగొట్టుకున్న బిజినెస్‌మెన్
ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలు పొందొచ్చని నమ్మిస్తూ కొంతమంది నిందితులు డబ్బు మొత్తం కాజేస్తున్నారు
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలు పొందొచ్చని నమ్మిస్తూ కొంతమంది డబ్బు మొత్తం కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఒక వ్యాపారవేత్త ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసానికి బలై దాదాపు రూ. 9 కోట్లను పోగొట్టుకున్నాడు.
పోలీసులు పేర్కొన్న దాని ప్రకారం, నోయిడాలోని సెక్టార్ 40కి చెందిన రజత్ బోత్రాకు మే 1న వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా అధిక మొత్తంలో లాభాలు పొందవచ్చని మెసేజ్ వచ్చింది. దాన్ని నమ్మిన ఆయన వారు చెప్పినట్టు విడతల వారీగా, మే 27 నాటికి దాదాపు రూ. 9.09 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత ఆయన ట్రేడింగ్ ఖాతా అకస్మాత్తుగా క్లోజ్ అయింది. దీంతో పొలీసులను ఆశ్రయించగా, విచారణ ప్రారంభించి వ్యాపారవేత్త బ్యాంక్ ఖాతాలోని రూ.1.62 కోట్లను స్తంభింపజేశారు.
ఆయన అకౌంట్ నుంచి దాదాపు రూ.9.09 కోట్లు వివిధ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఈ అమౌంట్ మొత్తం కూడా చెన్నై, అస్సాం, భువనేశ్వర్, హర్యానా, రాజస్థాన్‌తో సహా పలు ప్రాంతాల్లోని బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లు దర్యాప్తులో తేలింది. కేసును దర్యాప్తు చేయడానికి, దీనిలో ప్రమేయం ఉన్న సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్) వివేక్ రంజన్ రాయ్ మాట్లాడుతూ, నిందితులను పట్టుకోవడానికి అన్ని చర్యలను తీసుకుంటున్నాం, పెరుగుతున్న ఆన్‌లైన్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసాలు జరిగినట్లుగా గుర్తిస్తే సెంట్రల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 లేదా ఎమర్జెన్సీ నంబర్ 112 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌లలోని సైబర్ డెస్క్‌ని వీలైనంత త్వరగా సంప్రదించాలని కోరారు.