ICG: బంగ్లాదేశ్ నుంచి స్వదేశానికి 95 మంది భారతీయ మత్స్యకారులు
ఇండియన్ కోస్ట్ గార్డ్, బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ మధ్య సమన్వయంతో మత్స్యకారుల మార్పిడి జరిగింది.
దిశ, నేషనల్ బ్యూరో: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్‌తో నెలకొన్న ప్రతికూల సంబంధాల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాలు మత్స్యకారుల అప్పగింత ప్రక్రియను చేపట్టాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్, బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ మధ్య సమన్వయంతో మత్స్యకారుల మార్పిడి జరిగింది. ఇందులో భాగంగా వివిధ ఘటనల కారణంగా బంగ్లాదేశ్ అధికారులు అరెస్ట్ చేసిన 95 మంది మత్స్యకారులను, నాలుగు భారతీయ ఫిషింగ్ బోట్లను విజయవంతంగా స్వదేశానికి రప్పించారు. అలాగే, 90 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులను ఆ దేశానికి అప్పగించారు. బంగ్లాదేశ్‌కు అప్పగించిన వారిలో మునిగిపోయిన ఓ ఫిషింగ్ బోట్ నుంచి భారత నౌక 'కౌశిక్' రక్షించిన 12 మంది కూడా ఉన్నారని అధికారిక ప్రకటన వెలువడింది. ఐసీజీ షిప్ వరద్, అమృత్ కౌర్ నౌకల ద్వారా 95 మంది భారతీయ మత్స్యకారులను బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు రప్పించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటనలో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. 'ఇటీవలి నెలల్లో, అనేక మంది భారతీయ మత్స్యకారులు అనుకోకుండా అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను దాటి బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్లినప్పుడు బంగ్లాదేశ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే బంగ్లాదేశ్ మత్స్యకారులను కూడా భారత అధికారులు పట్టుకున్నారు. భారత మత్స్యకారుల భద్రత, రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలోనే మత్స్యకారుల విడుదలకు కృషి చేసినట్టు ఇండియన్ కోస్ట్ గార్డ్ తన అధికారిక ఎక్స్‌లో ట్వీట్ చేసింది.