నేపాల్ లో నదిలోకి దూసుకెళ్లిన రెండు బస్సులు, 63 మంది గల్లంతు

నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై కొండచరియలు విరిగిపడి రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లోని డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.

Update: 2024-07-12 03:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో : నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై కొండచరియలు విరిగిపడి రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లోని డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున నేపాల్‌లోని మదన్-ఆష్రిత్ హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, రెండు బస్సులు అదుపుతప్పి త్రిశూల్ నదిలో పడిపోయాయి. ఘటనాస్థలిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చిత్వాన్ జిల్లా చీఫ్ ఆఫీసర్ ఇంద్రదేవ్ యాదవ్ తెలిపారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోందని.. అందుకే సహాయకచర్యలకు ఆటంకం ఏర్పడుతోందన్నారు. ఇకపోతే, శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో నేపాల్ రాజధాని ఖాట్మండుకు వెళ్తున్న ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ ప్రమాదానికి గురయ్యాయని అధికారులు తెలిపారు. గల్లంతైన బస్సులు వెతికేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని అన్నారు.

నేపాల్ ప్రధాని సంతాపం

ఈ ఘటనపై నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ సంతాపం వ్యక్తం చేశారు. నారాయణగర్‌-ముగ్లిన్‌ రోడ్డు సెక్షన్‌లో కొండచరియలు విరిగిపడటంతో బస్సులు నదిలో కొట్టుకుపోయారన్న వార్త బాధ కలిగించిందన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టాలని నేపాల్ లోని హోం అడ్మినిస్ట్రేషన్ సహా అన్ని ప్రభుత్వ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే, ఖాట్మండు నుంచి భరత్ పూర్ కు వెళ్లే అన్ని విమానాలను శుక్రవారం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వానలు, వరదల వల్ల నేపాల్ లో 62 మంది చనిపోయారని హోంశాఖ తెలిపింది. దాదాపు 90 మంది గాయపడ్డారని వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా గణనీయమైన ఆస్తి నష్టం సంభవించిందని పేర్కొంది. కనీసం 121 ఇళ్లు నీటమునిగాయని తెలిపింది. నేపాల్ వ్యాప్తంగా వెయ్యి కుటంబాలు నిరాశ్రయులయ్యాయని వివరించింది.


Similar News