దిశ, నేషనల్ బ్యూరో: రెండు రోజుల వ్యవధిలోనే తైవాన్, జపాన్, చైనాలను వణికించిన భూకంపం.. తాజాగా భారత్‌లోనూ సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 7.4 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం.. తైవాన్‌ను కుదిపేయగా, ఆ మరుసటి రోజైన గురువారం చైనా, జపాన్‌లోనూ వరుసగా 5.5, 6.3 తీవ్రతతో సంభవించి భయాందోళనలకు గురిచేసింది. ఇదే సమయంలో గురువారం రాత్రి హిమాచల్ ప్రదేశ్‌లోనూ భూకంపం వచ్చింది. రాత్రి 9:34 గంటలకు చంబా ప్రాంతంతోపాటు మనాలీలోనూ తీవ్రమైన భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంప కేంద్రకాన్ని చంబాలో భూఉపరితలానికి 10 కి.మీ లోతులో గుర్తించినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.