G20 Summit: జీ20 సదస్సుకు 50 అంబులెన్స్‌లు..

జీ20 సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Update: 2023-08-28 16:13 GMT

న్యూఢిల్లీ: జీ20 సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతినిధులకు అవసరమైనప్పుడు అత్యవసర వైద్యాన్ని అందించేందుకు జీ20 సదస్సు ప్రధాన వేదిక, ప్రతినిధులు దిగే విమానాశ్రయాలు, బస చేసే హోటళ్ల వద్ద తగినంత వైద్య సిబ్బందితో 50 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు సోమవారం తెలిపారు. అత్యవసరమైనప్పుడు ఆర్ఎంఎల్, ఎయిమ్స్ వంటి ప్రముఖ ఆస్పత్రుల్లో చేర్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జీ20 సదస్సు వేదిక వద్ద రాత్రింబవళ్లు వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ ఏర్పాట్లను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

జీ20 సదస్సు వచ్చే నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనుంది. జీ20 అధ్యక్ష పదవిని భారత్ గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన చేపట్టింది. 1999లో ఆసియా ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లతో జీ20 ఏర్పాటైంది. 2007లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో జీ20కి ఆయా దేశాధినేతలు నేతృత్వం వహించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ కోసం జీ20ని ప్రధాన వేదికగా 2009లో గుర్తించారు. ప్రపంచ జీడీపీలో 85%, ప్రపంచ వాణిజ్యంలో 75%, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మందికి జీ20 ప్రాతినిధ్యం వహిస్తోంది.


Similar News