బావిలో విషవాయువు పీల్చి ఐదుగురు మృతి

శుక్రవారం ఉదయం బిర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కికిర్దా గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Update: 2024-07-05 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: చత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్- చంపా జిల్లాలో విషవాయువు కారణంగా ఐదుగురు మరణించిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం ఉదయం బిర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కికిర్దా గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులు రాంచంద్ర జైస్వాల్, రమేష్ పటేల్, రాజేంద్ర పటేల్, జితేంద్ర పటేల్, టికేశ్వర్ చంద్రగా పోలీసులు గుర్తించారు. బిలాస్‌పూర్ రేంజ్ ఐజీ అధికారి సంజీవ్ శుక్లా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తూ.. ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రామంలోని జైస్వాల్ అనే వ్యక్తి ఓ బావిలో పడిన వస్తువును బయటకు తీసేందుకు అందులోకి దూకాడు. అయితే, తను నీళ్లలోనే స్పృహ తప్పి పడిపోవడంతో ఆ వెంటనే అతని కుటుంబ సభ్యులైన మరో ముగ్గురు దూకారు. నలుగురూ బయటకు రాకపోవడంతో చంద్ర అనే వ్యక్తి మళ్లీ బావిలోకి దిగాడని, అతను కూడా అపస్మారక స్థితిలోకి చేరాడని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారితో పాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్‌డీఆర్ఎఫ్ టీమ్ బావిలో నుంచి ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారని ఐజీ తెలిపారు. బావిలోని నీళ్లలో విషవాయువు పీల్చడం వల్లే వారు మృతి చెందినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. దర్యాప్తు ప్రక్రియ జరుగుతోందని సంజీవ్ శుక్లా పేర్కొన్నారు. ఘటనపై స్పందించిన చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవసాయి విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. 


Similar News