Pregnant : 40 మంది అవివాహితలు గర్భిణులుగా నమోదు.. అంగన్‌వాడీ కార్యకర్త నిర్వాకం
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(Varanasi) జిల్లా మల్హియా గ్రామంలో 40 మంది అవివాహిత యువతుల ఫోనుకు షాకింగ్ మెసేజ్ వచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(Varanasi) జిల్లా మల్హియా గ్రామంలో 40 మంది అవివాహిత యువతుల ఫోనుకు షాకింగ్ మెసేజ్ వచ్చింది. ‘‘మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన న్యూట్రిషన్ ట్రాకర్ పోర్టల్‌లో గర్భవతి(Pregnant)గా మీ పేరు నమోదైంది’’ అని అందులో ఉండటాన్ని చూసి వారు తీవ్ర విస్మయానికి గురయ్యారు. దీనిపై సదరు యువతులు తమ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారంతా మల్హియా గ్రామ పెద్ద అమిత్ పటేల్‌ను కలిసి మెసేజ్‌ల గురించి వివరించారు. దీంతో వారణాసి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసరు(సీడీఓ)ను అమిత్ కలిసి.. యువతుల ఫోన్లకు వచ్చిన తప్పుడు మెసేజ్‌ల గురించి తెలియజేశారు.
దీనిపై విచారణ జరిపించిన సీడీఓ.. అంగన్‌వాడీ కార్యకర్త తప్పిదం వల్లే అవివాహిత యువతులకు ఈ మెసేజ్‌లు వెళ్లాయని గుర్తించారు. సదరు అంగన్‌వాడీ కార్యకర్త .. స్థానిక బూత్ లెవల్ అధికారి (బీఎల్‌ఓ)గానూ పనిచేస్తున్నారని తేలింది. బీఎల్‌ఓ హోదాలో.. ఓటు నమోదు కోసం, ఓటరు ఐడీలలో సవరణల కోసం ఆమె స్థానికుల నుంచి దరఖాస్తులను తీసుకున్నారు. ఈ దరఖాస్తులను అంగన్‌వాడీ కార్యకర్త పొరపాటున.. న్యూట్రిషన్ ట్రాకర్ పోర్టల్‌లో పేర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులతో కలిపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ తప్పిదం వల్లే ఓటుకు సంబంధించి అప్లికేషన్లు సమర్పించిన అవివాహిత యువతులకు.. ‘న్యూట్రిషన్ ట్రాకర్ పోర్టల్’ నుంచి మెసేజ్‌లు వచ్చాయని అధికారులు గుర్తించారు. వెంటనే ఆ పోర్టల్ నుంచి 40 మంది అవివాహితల పేర్లు, వివరాలను తొలగించారు. దరఖాస్తుల గోల్‌మాల్‌పై వివరణ కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తకు షోకాజ్ నోటీసును జారీ చేశారు.