మణిపూర్‌లో మళ్లీ హింస.. కాల్పుల్లో నలుగురు మృతి.. చేతులెత్తి మొక్కిన సీఎం
దుండగుల ముఠా తుపాకులతో దోపిడీకి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. హింస చెలరేగడంతో లోయ ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో మరోసారి కర్ఫ్యూ విధిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
దిశ, నేషనల్: నూతన సంవత్సరం వేళ మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. గుర్తుతెలియని దుండగుల ముఠా జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన థౌబల్ జిల్లాలోని లిలాంగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దుండగుల ముఠా తుపాకులతో దోపిడీకి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. హింస చెలరేగడంతో లోయ ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో మరోసారి కర్ఫ్యూ విధిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై రాష్ట్ర సీఎం బిరేన్ సింగ్ స్పందించారు. దీనిపై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘అమాయక ప్రజల మరణం నన్ను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. దోషులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. లిలాంగ్ వాసులకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా.. దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వానికి సహకరించండి. బాధితులకు చట్టం ప్రకారం న్యాయం చేసేందుకు ప్రభుత్వం శక్తి మేరకు కృషి చేస్తుందని హామీ ఇస్తున్నా’’ అని బిరేన్ సింగ్ వెల్లడించారు.