జమ్మూలో కొన్ని గంటల వ్యవధిలో 4 భూకంపాలు
జమ్మూలోని దోడా, కిష్త్వార్ పర్వత ప్రాంతాల్లో బుధవారం ఉదయం కొన్ని గంటల వ్యవధిలోనే నాలుగు భూకంపాలు సంభవించాయి.
దోడా (జమ్మూ) : జమ్మూలోని దోడా, కిష్త్వార్ పర్వత ప్రాంతాల్లో బుధవారం ఉదయం కొన్ని గంటల వ్యవధిలోనే నాలుగు భూకంపాలు సంభవించాయి. తెల్లవారుజామున 2.20 గంటలకు దోడా జిల్లాలో 4.3 తీవ్రతతో తొలి భూకంపం చోటుచేసుకుంది. ఆ వెంటనే 2.43 గంటలకు 2.8 తీవ్రతతో రియాసి జిల్లాలోని కత్రాకు తూర్పున 74 కిలోమీటర్ల దూరంలో రెండో భూకంపం సంభవించింది. దోడాలో ఉదయం 7.56 గంటలకు 3.5 తీవ్రతతో, కిష్త్వార్‌లో ఉదయం 8.29 గంటలకు 3.3 తీవ్రతతో ఇంకో రెండు భూకంపాలు వచ్చాయి. అయితే ఈ భూకంపాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు ఎలాంటి నివేదికలు లేవని అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో భూప్రకంపనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో బుధవారం పాఠశాలలను మూసివేశారు.