Bypoll: రేపు వయానాడ్, 31 అసెంబ్లీ స్థానాలకు బైపోల్
రేపు జార్ఖండ్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలతోపాటు పది రాష్ట్రాలకు చెందిన 31 అసెంబ్లీ స్థానాల్లో బైపోలింగ్ జరగనుంది. అలాగే, కేరళలోని వయానాడ్ లోక్ సభస్థానానికీ ఉపఎన్నిక జరుగుతుంది.
దిశ, నేషనల్ బ్యూరో: రేపు జార్ఖండ్ అసెంబ్లీ(Jharkhand Assembly Elections) తొలి విడత ఎన్నికల(First Phase Elections)తోపాటు పది రాష్ట్రాలకు చెందిన 31 అసెంబ్లీ స్థానాల్లో బైపోలింగ్(Bypoll) జరగనుంది. అలాగే, కేరళలోని వయానాడ్ లోక్ సభ(Kerala Wayanad Loksabha Seat)స్థానానికీ ఉపఎన్నిక జరుగుతుంది. కొందరు ఎమ్మెల్యేలు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రాజీనామా చేయడం, కొందరు ఎమ్మెల్యేలు మరణించడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎన్నికల కమిషన్ గతనెలలోనే వీటికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఉపఎన్నికల్లో ఓడిపోతే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపై పెద్దగా ప్రభావమేమీ ఉండదు. కానీ, హర్యానాలో కలిసి పోటీ చేయడంతో విఫలమైన ఇండియన్ బ్లాక్‌కు ఈ బైపోల్స్ ఒక సవాలును విసురుతున్నాయి. వయానాడ్ లోక్ సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పోటీ చేస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ రాయ్‌బరేలీని అట్టిపెట్టుకుని వయానాడ్ స్థానానికి రాజీనామా చేశారు. తాజాగా, ఈ స్థానానికి జరుగుతున్న బైపోలింగ్‌లో ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 4.3 లక్షలు, 2024లో 3.5 లక్షల మార్జిన్‌తో రాహుల్ గాంధీ ఇక్కడ విజయఢంకా మోగించారు. ఇప్పుడు ఈ మార్జిన్ మరింత పెంచడానికి ప్రియాంకా గాంధీ ప్రయత్నిస్తున్నారు. ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీపై ఎల్‌డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మోకెరి, ఎన్డీయే అభ్యర్థి నవ్య హరిదాస్‌లు పోటీ చేస్తున్నారు.
రాజస్తాన్(7), పశ్చిమ బెంగాల్(6), అసోం (5), బిహార్(4), కర్ణాటక(3), ఛత్తీస్‌గడ్, గుజరాత్, కేరళ, మేఘాలయా రాష్ట్రాల్లో ఒక్కటేసి అసెంబ్లీ స్థానాల్లో బైపోలింగ్ జరుగుతున్నది. సిక్కింలో రెండు స్థానాలు సోరెంగ్-చాకుంగ్, నాంచి-సింఘితంగ్ అసెంబ్లీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన అభ్యర్థులు వారి నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవడంతో సిక్కిం క్రాంతికారి మోర్చా అభ్యర్థులు ఆదిత్య గోలే, సతీశ్ చంద్ర రాయిలు ఏకగ్రీవమయ్యారు. ఈ అసెంబ్లీ, లోక్ సభ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు కూడా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోబాటే ఈ నెల 23 వ తేదీన వెలువడుతాయి.