కుక్కలా మొరగమంటూ.. యువకుడి మెడచుట్టూ బెల్టుకట్టి, దారుణం!
ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిని చుట్టుముట్టి.. అతడి మెడకు కుక్క తాడును కట్టి.. కుక్కలా మొరుగు అని వేధించిన ఘటనను మధ్యప్రదేశ్ సర్కారు తీవ్రంగా పరిగణించింది.
భోపాల్ : ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిని చుట్టుముట్టి.. అతడి మెడకు కుక్క తాడును కట్టి.. కుక్కలా మొరుగు అని వేధించిన ఘటనను మధ్యప్రదేశ్ సర్కారు తీవ్రంగా పరిగణించింది. భోపాల్‌లో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటనకు సంబంధించిన 48 సెకన్ల వీడియో క్లిప్ పై ర్యాపిడ్ గా రియాక్ట్ అయింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు సమీర్, సాజిద్, ఫైజాన్ అనే ముగ్గురు నిందితుల ఇళ్ళపై సోమవారం అధికారులు బుల్డోజర్ యాక్షన్ తీసుకున్నారు. పోలీసులు దగ్గరుండి మరీ నిందితుల ఇళ్లను కూల్చివేయించారు. అంతకుముందు బాధితుడు విజయ్ రామచందానిని వేధించినందుకు ముగ్గురు యువకులపై జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్ఎస్ఏ) ప్రయోగించారు.
దీనితో పాటు మత స్వేచ్ఛ చట్టం, అపహరణ, బంధించడం, ఉద్దేశపూర్వకంగా హాని తలపెట్టడం వంటి అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటికి వచ్చి వారిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. డ్రగ్స్ తాగాలని, మాంసం తినాలని, మతం మారాలని ఆ ముగ్గురు నిందితులు బలవంతం చేశారని విజయ్ రామచందాని కుటుంబం ఆరోపించింది. వైరల్ అయిన ఆ వీడియో క్లిప్ ప్రకారం.. కొందరు వ్యక్తులు ఓ యువకుడి మెడ చుట్టూ బెల్టు కట్టి వేధింపులకు పాల్పడ్డారు. కుక్కలా మొరగమని బెదిరించారు. వారు ఆ యువకుడి తల్లి, సోదరిని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు. ఒకవైపు వారు తిడుతుంటే.. తాను ఏ తప్పూ చేయలేదని బాధితుడు చెప్పడం ఆ వీడియోలో వినిపిస్తుంది.