Delhi Pollution : ఢిల్లీ కాలుష్య నియంత్రణ రూల్స్ కఠినతరం
దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య(Delhi pollution) నియంత్రణ చర్యల అమలుకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్’ (CAQM) మరింత కఠినతరం చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య(Delhi pollution) నియంత్రణ చర్యల అమలుకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్’ (CAQM) మరింత కఠినతరం చేసింది. ఢిల్లీలోని కాలుష్య స్థాయులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఒక్కో కేటగిరీలో ఉన్నప్పుడు ఒక్కో రకమైన కాలుష్య నియంత్రణ చర్యలను అమలు చేస్తుంటారు. వీటిని సాంకేతిక పరిభాషలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (గ్రేప్) అని పిలుస్తారు. గ్రేప్-1, గ్రేప్-2, గ్రేప్-3, గ్రేప్-4 దశలలో వేర్వేరు రకాల రూల్స్ అమలవుతుంటాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ జిల్లాల్లో గ్రేప్-3, గ్రేప్-4 దశలు అమల్లో ఉన్నప్పుడు తప్పకుండా స్కూళ్లను మూసేయాలని పేర్కొంటూ నిబంధనలను బుధవారం రోజు కేంద్రం సవరించింది. ఇంతకుముందు విద్యాసంస్థల మూసివేతపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేది. ఢిల్లీ, ఎన్‌సీఆర్ జిల్లాలు గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతం బుద్ధ నగర్ గ్రేప్-3 దశలో ఉన్న టైంలో ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్ విభాగాల సిబ్బందికి టైమింగ్స్‌ను పాటించే విషయంలో కొంత స్వేచ్ఛను కల్పించాలనే నిబంధనను కేంద్రం పొందుపరిచింది. అయితే ఇతరత్రా ఎన్‌సీఆర్ జిల్లాల్లో ఉద్యోగుల టైమింగ్స్‌పై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవచ్చని కేంద్రం పేర్కొంది.
కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ప్రతి ఇంటా బాధితులే : సర్వే నివేదిక
వాయు కాలుష్యం వల్ల ఢిల్లీ(Delhi)లోని ప్రతి ఇంటిలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని లోకల్ సర్కిల్స్ సర్వే నివేదిక వెల్లడించింది.దేశ రాజధానిలోని 75శాతం కుటుంబాల్లో కనీసం ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది గొంతునొప్పి లేదా దగ్గుతో బాధపడుతున్నట్లు సర్వేలో గుర్తించారు. కాలుష్య స్థాయులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో హస్తినలోని 58 శాతం కుటుంబాలకు చెందిన వారిలో తలనొప్పి సమస్య, 50శాతం మందిలో శ్వాసకోశ సమస్య తలెత్తినట్లు వెల్లడైంది. ఇలా బాధపడుతున్న వారి సంఖ్య గత నెల రోజుల వ్యవధిలో రెట్టింపు అయ్యిందని తేలింది. ఢిల్లీలోని ప్రతి నాలుగు కుటుంబాలలో మూడు కుటుంబాలు కాలుష్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నాయని గుర్తించారు. ఈ సర్వేలో భాగంగా ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో 21వేల మందికిపైగా ప్రజలను సంప్రదించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది పురుషులు, 37 శాతం మంది మహిళలు.