J&K: లోయలో పడ్డ బస్సు.. ముగ్గురు BSF జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. బుద్గామ్ జిల్లాలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) సైనికులతో ప్రయాణిస్తున్న బస్సు బ్రెల్ వాటర్‌హైల్ ప్రాంతానికి సమీపంలో అదుపుతప్పి 40 అడుగుల లోయలోకి పడిపోయింది.

Update: 2024-09-20 14:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. బుద్గామ్ జిల్లాలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) సైనికులతో ప్రయాణిస్తున్న బస్సు బ్రెల్ వాటర్‌హైల్ ప్రాంతానికి సమీపంలో అదుపుతప్పి 40 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు పేర్కొన్న దాని ప్రకారం, జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబరు 15న రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ నిర్వహణలో భద్రత కోసం 35 మందితో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది.

ఘటన జరిగిన వెంటనే స్థానికులు లోయలోకి దిగి బస్సులో చిక్కుకున్న వారిని కాపాడటానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు మొదలుపెట్టారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు కాగా, గాయపడిన ఆరుగురు సైనికుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారందరిని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల రాజౌరిలో ఆర్మీ వాహనం రోడ్డుపై నుంచి జారి లోతైన లోయలో పడిన మూడు రోజుల తర్వాత ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్‌ ఎన్నికల విధుల కోసం 110 మంది సిబ్బందితో కూడిన దాదాపు 900 కంపెనీలకు భద్రత బాధ్యతలు అప్పగించారు.


Similar News