ఇస్లామాబాద్ : కరుడుగట్టిన టెర్రరిస్ట్, 26/11 ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ కీలక అనుచరుడు ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్ (30) హతమయ్యాడు. శనివారం రోజు పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ మసీదు నుంచి ముఫ్తీ ఖైజర్ బయటికి రాగానే.. బైక్ పై ఎదురొచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఖైజర్ ఫరూఖ్ కుప్పకూలాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఈ కాల్పుల్లో అక్కడే ఉన్న పదేళ్ల బాలుడికి గాయాలయ్యాయి. హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలోకి రిక్రూట్ చేసుకునే పిల్లలకు ఖైజర్ ఫరూక్ ఉగ్రవాద పాఠాలను నేర్పేవాడు. ఉగ్రవాది హఫీజ్ సయీద్ కుమారుడు కమాలుద్దీన్ సయీద్ సెప్టెంబర్ 26 నుంచి కనిపించకుండా పోయాడు. పెషావర్‌లో కారులో వచ్చిన దుండగులు కమాలుద్దీన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కమాలుద్దీన్ ఆచూకీ వివరాలు బయటికి రాకముందే.. హఫీజ్ సయీద్ కీలక అనుచరుడు మర్డర్‌కు గురికావడం గమనార్హం.