బీజేపీలో 261 మంది రౌడీలు.. మోడీపై సీఎం స్టాలిన్ విమర్శలు
ఇలాంటి నాయకులు తమ పార్టీలో ఉన్నప్పుడు శాంతిభద్రతలపై వ్యాఖ్యానించే హక్కు ప్రధాని మోడీకి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కీలక నేతల వ్యాఖ్యలు, విమర్శలు పదునెక్కుతున్నాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రధాని మోడీపై విమర్శలు పెంచారు. ఇటీవల ప్రధాని మోడీ రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, సేలంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సేలం డీఎంకె అభ్యర్థి టీఎం సెల్వగణపతి, కళ్లకురిచి డీఎంకె అభ్యర్థి డి మలైయరసన్‌ల తరపున మాట్లాడిన ప్రసంగంలో ఎంకె స్టాలిన్ మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీలో నేరచరిత్ర ఉన్న 261 మంది ఉన్నారని ఆరోపణలు చేశారు. ఇలాంటి నాయకులు తమ పార్టీలో ఉన్నప్పుడు శాంతిభద్రతలపై వ్యాఖ్యానించే హక్కు ప్రధాని మోడీకి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. వాళ్ల పార్టీలో అంతమంది రౌడీలు ఉన్నప్పుడు, మీకు శాంతిభద్రతల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బీజేపీ పార్టీల నేతల చరిత్ర గురించి 32 పేజీల నివేదికను చూపించిన స్టాలిన్, బీజేపీ నేతలపై మొత్తం 1,977 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.