డెంగ్యూతో 24 మంది మృతి.. పెరుగుతున్న కేసులు
ఉత్తరప్రదేశ్‌లో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 24 మంది మరణించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ప్రైవేట్ ఆసుపత్రుల డేటాను కూడా కలుపుకుంటే ఆ సంఖ్య మరింత పెరుగనుంది. ప్రధాన నగరాల్లోని ఆసుపత్రులు చాలా మంది డెంగ్యూ రోగులను చేర్చుకున్నాయి. ప్రతిరోజూ కొత్త కేసులను కూడా వస్తూనే ఉన్నాయి. యూపీలో డెంగ్యూ కేసుల సంఖ్య 13,000 దాటింది. లక్నో, మొరాదాబాద్, మీరట్, కాన్పూర్, నోయిడా ప్రాంతాలు డెంగ్యూకు హాట్‌స్పాట్‌లుగా మారాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 600 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వాతావరణంలో మార్పుతో రానున్న రోజుల్లో డెంగ్యూ వ్యాధిగ్రస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు సోమవారం నుంచి రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు అన్ని ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ ఆదేశాలు జారీ చేశారు. డెంగ్యూ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ప్రైవేటు ఆసుపత్రులను మర్గదర్శకాలు జారీ చేశారు.