Russia-Ukraine War: మరో భారతీయుడు మృతి

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో మరో భారతీయుడు బలయ్యాడు. మాస్కో సైన్యంలో పనిచేస్తున్న హర్యానాకు చెందిన 22 ఏళ్ల రవి మౌన్ చనిపోయిటన్లు అతడి కుటుంబసభ్యుల తెలిపారు.

Update: 2024-07-29 08:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో మరో భారతీయుడు బలయ్యాడు. మాస్కో సైన్యంలో పనిచేస్తున్న హర్యానాకు చెందిన 22 ఏళ్ల రవి మౌన్ చనిపోయిటన్లు అతడి కుటుంబసభ్యుల తెలిపారు. రష్యన్‌ ఫ్రంట్‌లైన్‌లో పనిచేస్తూ మరణించాడని తమకు సమాచారం అందినట్లు అతడి కుటుంబసభ్యులు వెల్లడించారు. కాగా.. రవి మృతిని మాస్కోలోని ఇండియన్ ఎంబసీ ధ్రువీకరించినట్లు అతడి సోదరుడు అజయ్ మౌన్ మీడియాకు తెలిపారు. అయితే, అతడు ఎలా చనిపోయాడో తమకు తెలియలేదన్నారు. రవాణా విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ తన సోదరుడిని ఓ ఏజెంట్‌ రష్యా తీసుకెళ్లినట్లు అజయ్ తెలిపారు. ఈ ఏడాది జనవరిలోనే అతడు మాస్కో వెళ్లాడని చెప్పారు. ఆ తర్వాత అతడిని బెదిరించి బలవంతంగా రష్యా సైన్యంలోకి తీసుకున్నారని ఆరోపించారు.

రవి సోదరుడు ఏమన్నారంటే?

రవి సోదరుడు మాట్లాడుతూ..‘‘ఈ ఏడాది మార్చి 12 వరకు రవి మాతో టచ్‌లోనే ఉన్నాడు. వారం రోజుల నుంచి యుద్ధంలో విధులు నిర్వర్తిస్తున్నాని చెప్పారు. ఆ తర్వాత రవి నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. అతడిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. చివరకు జులై 21న మాస్కోలోని ఇండియన్ ఎంబసీకి మెయిల్ చేశా. వారు రష్యన్ అధికారులతో సంప్రదింపులు జరిపాక రవి మృతి తెలిసింది. ఆ వార్త విని మా గుండెముక్కలయ్యింది” అని మృతుడి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు.

మాస్కోలోని ఇండియన్ ఎంబసీ ఏమందంటే?

మాస్కోలోని రాయబార కార్యాలయం రవి మృతదేహాన్ని గుర్తించేందుకు ఇండియన్ ఎంబసీ సాయం చేస్తామంది. గుర్తింపు ఉన్న ఆస్పత్రి నుంచి డీఎన్ఏ పరీక్ష నివేదిక అందించాలని కుటుంబాన్ని అభ్యర్థించింది. రవి అస్థికలను స్వదేశానికి రప్పించడంలో సహాయం కోసం కుటుంబ సభ్యులు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా పరిస్థితిని "హృదయ విదారకంగా" అభివర్ణించారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి తక్షణ జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


Similar News