ఢిల్లీలో భారీ ఈదురుగాలులు, వర్షం.. 22 విమానాల దారి మళ్లింపు

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

Update: 2024-04-13 14:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం నేపథ్యంలో ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో 22 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. వాటిలో వాటిలో 9 విమానాలను జైపూర్‌కు, 8 లక్నోకు, 2 చండీగఢ్‌కు, ఒక్కొక్కటి వారణాసి, అమృత్‌సర్, అహ్మదాబాద్‌లకు మళ్లించారు. ఈ విమానాల్లో ఇండిగోకు చెందినవి 9, ఎయిరిండియాకు చెందిన 8 విమానాలు, విస్తారాకు చెందిన 3 విమానాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

శనివారం ఢిల్లీలోని ఆర్‌కె పురం, ఇండియా గేట్, పండిట్ పంత్ మార్గ్, మునిర్కాతో సహా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇప్పటికే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30-50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. నిన్నటి వరకు ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడిన ఢిల్లీ ప్రజలు ఈ వర్షంతో కొంత ఉపశమనం పొందారు. ఢిల్లీలో శుక్రవారం 39.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది, ఇది జనవరి తర్వాత అత్యధికం. మే లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు కూడా చేరుకునే అవకాశం ఉంది.


Similar News