ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్

గాయపడిన ఇద్దరు భద్రతా సిబ్బందిని సుక్మాలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Update: 2025-03-29 05:49 GMT
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్
  • whatsapp icon

- 20 మంది నక్సల్స్ మృతి

- గాయపడిన ఇద్దరు జవాన్లు

- సుక్మా జిల్లాలో ఘటన

- మూడు నెలల్లో 100 మంది మావోయిస్టుల హతం

దిశ, నేషనల్ బ్యూరో: దండకారణ్యం మరో సారి రక్తసిక్తమైంది. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని శపథం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో మూడు నెలల్లోనే 100 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టలు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సిబ్బందితో కూడిన భద్రతా దళాల సంయుక్త బృందం శుక్రవారం రాత్రి నక్సల్ వ్యతిరేక ఆపరేషన్స్‌కు బయలుదేరాయి. ఈ క్రమంలో కెర్లపాల్ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురు పడటంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుందని భద్రతా దళాలు తెలిపాయి. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు, రెండు ఏకే-47 గన్‌లు, ఇతర దేశీయంగా తయారు చేసిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన ఇద్దరు భద్రతా సిబ్బందిని సుక్మాలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

2025 ప్రారంభం నుంచి భద్రతా దళాలు మావోయిస్టులపై తమ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులకు భారీగా నష్టం జరుగుతోంది. మార్చి 20న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో భద్రతాదళాలు కనీసం 30 మంది నక్సలైట్లను హతమార్చాయి. బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో 26 మృతదేహాలు లభించగా.. కాంకేర్‌లో నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 2026 మార్చి నాటికి నక్సలైట్ల ముప్పును నిర్మూలించడానికి బహుముఖ వ్యూహం అనుసరిస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు ఆపరేషన్ కగార్‌ను ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News