10 నిమిషాల ముందు ఆరుగురి పేర్లు ఇస్తారా..? ఈసీల ఎంపికపై కాంగ్రెస్ ఫైర్
దిశ, నేషనల్ బ్యూరో : కొత్త కేంద్ర ఎన్నికల కమిషనర్లుగాా బ్యూరోక్రాట్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ పేర్లను ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలోని ఎంపిక కమిటీ గురువారం మధ్యాహ్నం ఖరారు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : కొత్త కేంద్ర ఎన్నికల కమిషనర్లుగాా మాజీ బ్యూరోక్రాట్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ పేర్లను ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలోని ఎంపిక కమిటీ గురువారం మధ్యాహ్నం ఖరారు చేసింది. ఈ ఎంపిక కమిటీలో కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి కూడా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఎంపిక జరిగిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు నిన్న(బుధవారం) రాత్రి ఒక లిస్టును పంపారు. ఎన్నికల కమిషనర్ పోస్టుల కోసం కేంద్రం పరిశీలిస్తున్న 212 మంది మాజీ బ్యూరోక్రాట్ల పేర్లు అందులో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాను. అంత మంది నుంచి సమర్ధులైన ఇద్దరిని ఎంపిక చేయడానికి కొన్ని గంటల టైం సరిపోతుందా ? కేంద్ర ప్రభుత్వమే కొందరిని ఎంపిక చేసి తుదిజాబితా ఇస్తే స్క్రీనింగ్ చేసేందుకు, అభిప్రాయం చెప్పేందుకు అవకాశం ఉండేది’’’ అని అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు.
212 మంది పేర్లతో కూడిన లిస్టును పట్టుకొని..
‘‘212 మంది మాజీ బ్యూరోక్రాట్ల పేర్లతో కూడిన లిస్టును పట్టుకొని నేను బుధవారం అర్ధరాత్రే ఢిల్లీకి చేరుకున్నాను. గురువారం మధ్యాహ్నం ప్రధాని మోడీ సారథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ భేటీ అయింది. ప్రతిపక్షం తరఫున నేను పాల్గొన్నాను. ఆ మీటింగ్‌కు పది నిమిషాల ముందు నాకు ఆరుగురి పేర్లతో కూడిన షార్ట్‌లిస్ట్ ఇచ్చారు’’ అని అధిర్ చెప్పారు. ఆ ఆరుగురిలో నుంచే ఇద్దరి పేర్లను ప్రధాని మోడీ ఏకపక్షంగా ఖరారు చేశారని వెల్లడించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియను అకస్మాత్తుగా, అడ్డదిడ్డంగా నిర్వహించడంపై తాను ఎంపిక కమిటీ భేటీలోనే నిరసన వ్యక్తం చేశానని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఈ కమిటీలో సభ్యులుగా ఉండి ఉంటే ఈసీల ఎంపిక వ్యవహారంలో సమతుల్యత ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈసీల ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్నారు. మెజారిటీ సభ్యులు ప్రభుత్వం తరఫు వారే ఉండటంతో.. వారు తీసుకున్న నిర్ణయమే అమల్లోకి వస్తుంది. ఇంతకుముందు ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి స్థానంలో సీజేఐ సభ్యులుగా ఉండేవారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక చట్టం ద్వారా సీజేఐను ఈ ఎంపిక కమిటీ నుంచి తప్పించింది.