రైల్వేలకు 2.55 లక్షల కోట్లు.. ఏపీ, తెలంగాణలకు ఎంత కేటాయించారో తెలుసా?
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లను కేటాయించారు.
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లను కేటాయించారు. భారతీయ రైల్వేలకు ఈసారి అత్యధిక మూలధన వ్యయ కేటాయింపులు చేశారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇది 2013-2014 కేంద్ర బడ్జెట్‌లో రైల్వేల కోసం చేసిన మూలధన వ్యయం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ. రైల్వేకు 2019 బడ్జెట్‌లో రూ.69,967 కోట్లు, 2020లో రూ.70,250 కోట్లు, 2021లో రూ.లక్ష కోట్లు కేటాయించారు. 2023లో తొలిసారిగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు రూ.2 లక్షల కోట్లు దాటాయి. కిందటేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వేలకు అలాట్ చేసింది రూ.2.4 లక్షల కోట్లు. 40వేల జనరల్ రైలు బోగీలకు ‘వందే భారత్’ ప్రమాణాలతో మార్పులు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రయాణికుల సౌలభ్యం, భద్రతను పెంచేలా బోగీలలో మార్పులు ఉంటాయని చెప్పారు. రైలు మార్గాల్లో హైట్రాఫిక్, హైడెన్సిటీ కారిడార్లలో నూతన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చనున్నట్లు ఆమె వెల్లడించారు. ‘పీఎం గతిశక్తి’ పథకం కింద 3 రైల్వే ఎకనామిక్ కారిడార్‌లను నిర్మిస్తామన్నారు. ఇంధనం - మినరల్ - సిమెంట్, పోర్ట్ కనెక్టివిటీ, హై ట్రాఫిక్ డెన్సిటీ ఇలా వివిధ రంగాల ప్రయోజనం కోసం 3 ఆర్థిక కారిడార్లను అమలు చేయనున్నట్లు నిర్మల వివరించారు. రద్దీ ఎక్కువగా ఉండే కారిడార్లలో రద్దీ తగ్గితే ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు కూడా తగ్గుతాయి. ఇది ప్రయాణికులకు భద్రతను పెంచుతుంది. రైళ్లలో అధిక వేగంతో ప్రయాణించేలా చేస్తుందని ఆర్థిక మంత్రి అన్నారు.
ఏపీ రైల్వే బడ్జెట్ కేటాయింపులు..
కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలో రైల్వే వికాసానికి ఈసారి ఆశాజనక స్థాయిలోనే నిధులను కేటాయించారు.ఈవివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా రూ. 14,209 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని రైల్వే మౌలిక, రక్షణ సంబంధించిన ప్రాజెక్టుల కోసం రూ. 9,138 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2009 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం రూ. 886 కోట్లు కేటాయిస్తే.. ఈసారి దానికంటే 10 రెట్లు ఎక్కువగా బడ్జెట్ కేటాయించారు. అప్పటితో పోలిస్తే 2024- 25 బడ్జెట్ కేటాయింపులు 931 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఏడాదికి 240 కిలోమీటర్ల చొప్పున ట్రాక్ పనులు జరుగుతున్నాయని, ఏపీలో 98 శాతం విద్యుద్దీకరణ పూర్తయినట్లు ఆయన చెప్పారు.
తెలంగాణ రైల్వే బడ్జెట్ కేటాయింపులు..
తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలు, భద్రత ప్రాజెక్టుల కోసం ఈసారి రూ. 5071 కోట్లు కేటాయించారు. 2021- 22 బడ్జెట్‌లో రూ. 2420 కోట్లు కేటాయించిగా ఇప్పుడు దాన్ని రెండు రెట్లు పెంచారు. 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ 109 శాతం పెరిగి రూ. 5071 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. తెలంగాణలో 100 శాతం విద్యుదీకరణ పూర్తయినట్లు చెప్పారు. రాష్ట్రంలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేసినట్లు చెప్పారు.