Nepal: ఘోర విమాన ప్రమాదం.. 18 మంది మృతి

నేపాల్‌(Nepal)లో ఘోర విమాన ప్రమాదం జరిగి 18 మంది చనిపోయారు. కాట్మాండు(Kathmandu)లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం కూలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Update: 2024-07-24 07:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నేపాల్‌(Nepal)లో ఘోర విమాన ప్రమాదం జరిగి 18 మంది చనిపోయారు. నేపాల్ రాజధాని కాట్మాండు(Kathmandu)లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం కూలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇప్పటివరకు 18 మంది డెడ్ బాడీలను వెలికితీసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. కాగా.. పైలట్ కు తీవ్రగాయాలయ్యాయి. పైటల్ ని విమానాశ్రయ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. కాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోఖారాకు వెళ్లే శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్‌వేపై నుంచి జారి క్రాష్ అయింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానం టేకాఫ్‌ ప్రారంభించగానే రన్‌వేపై నుంచి జారిపోవడంతో మంటలు చెలరేగాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. 50 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉన్న సీఆర్‌జే 200 (CRJ200) విమానం టేకాఫ్‌లో ఏ మాత్రం ఎత్తుకు వెళ్లకపోవడంతో రన్‌వే నుంచి జారిపడి క్రాష్ అయినట్లు తెలిపారు. ప్రమాదం తర్వాత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

త్రిభువన్ ఎయిర్ పోర్టు

త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని వైపులా లోతైన లోయలు ఉన్నాయి. ఇదో టేబుల్ టాప్ విమానాశ్రయం. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర విమానాశ్రయాలలో ఇది ఒకటి. నేపాల్ ఎయిర్ ఇండస్ట్రీ ప్రపంచంలోనే అత్యంత చెత్త ఎయిర్ సేఫ్టీ రికార్డులను కలిగి ఉంది. సరైన నిర్వహణ లేకపోవడం వల్ల చాలా పేలవమైన భద్రత ఉంది. కాగా.. 2023లో పోఖారాలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. యతి ఎయిర్‌లైన్స్ విమానం కూలి ఐదుగురు భారతీయులతో సహా మొత్తం 72 మంది మరణించారు. ఇది 1992 నుండి నేపాల్‌లో అత్యంత ఘోర ప్రమాదం జరిగింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం కాట్మండు విమానాశ్రయానికి చేరుకునే సమయంలో కూలిపోయింది. ఆ ఘటనలో 167 మంది చనిపోయారు.


Similar News