బీజేపీకి 17, జేడీయూకు 16: బిహార్‌లో కుదిరిన పొత్తు!
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఎన్నికల్లో సీట్ షేరింగ్, పోటీచేసే అభ్యర్థులపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే బిహార్‌లో ఎన్డీయే కూటమి మధ్య సీట్ల పంపకం కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఎన్నికల్లో సీట్ షేరింగ్, పోటీచేసే అభ్యర్థులపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే బిహార్‌లో ఎన్డీయే కూటమి మధ్య సీట్ల పంపకం కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు గాను బీజేపీ 17, జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) 16 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎల్‌జేపీ(రామ్ విలాస్) ఐదు స్థానాల్లో, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం పార్టీలు ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. బిహార్ సీఎం నితీశ్ కుమార్ జేడీయూ నేత లలన్ సింగ్, రాజ్యసభ ఎంపీ సంజయ్ కుమార్ ఝాతో చర్చలు జరిపి సీట్ షేరింగ్ ఫార్ములాపై చర్చించారు. ఈ విషయమై బీజేపీ నేతలతో చర్చించేందుకు నితీశ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అనంతరం సీట్ షేరింగ్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం.
హజీపూర్ సీటుపై ప్రతిష్టంభన!
బిహార్‌లో ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్), కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్‌కు చెందిన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(ఆర్ఎల్‌జేపీ), హిందుస్థాన్ అవామీ మోర్చా(హెచ్ఏఎం), లోక్ మోర్చా(ఆర్ఎల్ఎం) పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ఇందులో ఆర్ఎల్‌జేపీకి రాజ్యసభ సీటుతో పాటు నితీశ్ కేబినెట్‌లో మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, 2019 ఎన్నికల్లో బీజేపీ 17, జేడీయూ 16, ఎల్‌జేపీ ఆరుస్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఈ సారి హజీపూర్ సెగ్మెంట్ పై పరాస్, అతని మేనల్లుడు చిరాగ్ పాశ్వాన్ మధ్య పోటీ ఉన్నట్టు సమాచారం. ఈసీటును పాశ్వాన్‌కు కేటాయిస్తున్నట్టు వార్తలు రావడంతో పరాస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కూడా క్లారిటీ వచ్చిందని త్వరలోనే సీట్ షేరింగ్ పై ప్రకటన ఉంటుందని జేడీయూ నేత సంజయ్ కుమార్ ఝా తెలిపారు.
ఆర్జేడీ 28, కాంగ్రెస్ 9?
మరోవైపు ఇండియా కూటమిలోనూ సీట్ షేరింగ్ పై చర్చించేందుకు సోమవారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇండియా కూటమిలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), కాంగ్రెస్, సీపీఐఎంఎల్, సీపీఐ, సీపీఎంలు ఉన్నాయి. సీట్ల పంపకంలో భాగంగా ఆర్జేడీ 28 స్థానాల్లో, కాంగ్రెస్ 9 చోట్ల, సీపీఐఎంఎల్ రెండు సెగ్మెంట్లలో, సీపీఐ ఒక స్థానంలో పోటీ చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019లో కాంగ్రెస్ ఒక కిషన్ గంజ్ స్థానంలో మాత్రమే గెలుపొందింది. కాగా, బిహార్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.