135 కోట్లమంది మనల్ని చూసి నవ్వుతున్నారు: Rajyasabha రాజ్యసభ చైర్ పర్సన్
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రసాభాస కొనసాగుతుండటంపై భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్ పర్సన్ జగ్‌దీప్ ధన్‌కర్ తీవ్రంగా స్పందించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రసాభాస కొనసాగుతుండటంపై భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్ పర్సన్ జగ్‌దీప్ ధన్‌కర్ తీవ్రంగా స్పందించారు. ప్రజావాణిని ప్రతిబింబించాల్సిన పార్లమెంట్ సమావేశాలను రసాభాస చేస్తున్న గౌరవ సభ్యులను మందలించారు. గలాభా సృష్టించడానికి మనం చిన్న పిల్లలం కాదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు దేశ స్వాతంత్య్ర సమరానికి చేసిన దోహదం ఏదీ లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన తాజావ్యాఖ్య ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో జగ్‌దీప్ సీరియస్ అయ్యారు.
చట్టసభల్లోని సభ్యులు ఇలా నడుచుకుంటే మనందరికీ చాలా చెడ్డ పేరు వస్తుందన్నారు. సభలో మనం చాలా చెడ్డ ఉదాహరణను నెలకొల్పుతున్నాం. బయట ఉన్న ప్రజలు మన పట్ల భ్రమలు కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం ఖర్గే వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం లేపాయి. దీంతో జగ్‍దీప్ చైర్ పర్సన్ స్థానం నుంచి లేచి నిలబడి పాలక, ప్రతిపక్ష సభ్యులందరినీ ఉద్దేశించి హెచ్చరించారు.
సభికుల అరుపులు, గావుకేకల మధ్యనే ఆయన ప్రసంగించారు. సభలోని పరిణామాలు తనకు ఏమాత్రం మింగుడుపడటం లేదని, ఇది బాధాకరమైన అనుభవమని పేర్కొన్నారు. నన్ను నమ్మండి. 135 కోట్ల మంది ప్రజలు మనల్ని చూసి నవ్వుతున్నారు. మనం ఏ స్థాయికి పతనమవుతున్నామో చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అని పేర్కొన్నారు.
రాజస్థాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ ఇంటి కుక్క ప్రస్తావన చేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని పాలక పక్ష సభ్యులు వీరంగమాడారు. ఒక భావోద్వేగ క్షణంలో చట్టసభ వెలుపల ఎవరైనా వ్యాఖ్యానించి ఉండవచ్చు. అలాంటి వ్యాఖ్యలకు ప్రాతిపదిక కూడా ఉండకపోవచ్చు. ప్రతిపక్ష నేత అభిప్రాయంపై విబిన్న అభిప్రాయాలు కూడా ఉండవచ్చు. కానీ సభా నేతగా తాను మాట్లాడుతున్నప్పుడు, ప్రతిపక్ష నేతగా ఖర్గే మాట్లాడుతున్నప్పుడు సభ్యులు అంతరాయం కలిగించడం కుక్కకాటుకు చెప్పుదెబ్బ లాంటి వ్యవహారం కాదని, మనం చిన్న పిల్లలం కాదని రాజ్యసభ చైర్ పర్సన్ హితవు చెప్పారు.
రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు తనకు స్వపక్షం, పరపక్షం అనే తేడాలుండవని, ఆ సమయంలో తన దృష్టిలో రాజ్యాంగం మాత్రమే ఉంటుందని జగ్‌దీప్ పేర్కొన్నారు. గలాభా మధ్యనే ఖర్గేని తన అభిప్రాయం చెప్పాలని అనుమతించారు.
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్న ఖర్గే
తాను పార్లమెంట్ వెలుపల రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో భారత్ జోడో యాత్రలో భాగంగా సదరు వ్యాఖ్య చేశానని, దానిపై పార్లమెంట్ లో చర్చ జరగకూడదని ఖర్గే చెప్పారు. భారత స్వాతంత్య్ర సమరంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమీ లేదని తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.