6 నెలల్లో భారత్-పాక్ సరిహద్దులో 126 డ్రోన్‌లు, 150 కిలోల డ్రగ్స్ స్వాధీనం
ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో భారత్-పాక్ సరిహద్దులో 126 డ్రోన్‌లు, 150 కిలోల హెరాయిన్, 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని సరిహద్దు భద్రతా దళం(BSF) బుధవారం పేర్కొంది
దిశ, నేషనల్ బ్యూరో: ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో భారత్-పాక్ సరిహద్దులో 126 డ్రోన్‌లు, 150 కిలోల హెరాయిన్, 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని సరిహద్దు భద్రతా దళం(BSF) బుధవారం పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఇది రికార్డు స్థాయి అని అధికారులు పేర్కొన్నారు. 2023లో, పంజాబ్‌లోని బీఎస్‌ఎఫ్ పాకిస్తాన్ నుండి వస్తున్న 107 డ్రోన్‌లను స్వాధీనం చేసుకుంది. అయితే, ఈ సంవత్సరం కేవలం ఆరు నెలల వ్యవధిలో, ఇప్పటికే 126 డ్రోన్లు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. అలాగే, ఒక పాకిస్తానీ జాతీయుడిని దేశంలోని రాకుండా ఆపడంతో పాటు, అంతర్జాతీయ సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తున్న 21 మంది పాకిస్తానీ పౌరులను అరెస్టు చేసింది.
బీఎస్‌ఎఫ్ పంజాబ్‌లోని 553 కి.మీ పొడవునా విభిన్నమైన, కఠినమైన, సవాళ్లతో కూడిన భారత్-పాక్ సరిహద్దులో 24 గంటలూ పహారా కాస్తుంది. ఇటీవల కాలంలో ఉగ్రవాదుల కదలికలు మరింత ముమ్మరం అయిన నేపథ్యంలో బీఎస్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలని చూస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటుంది. మరోవైపు పాకిస్తాన్ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా ఎక్కువ అయిన నేపథ్యంలో దీనిని కట్టడి చేయడానికి ఆకాశంలో ఎగిరే వస్తువులపై నిఘా పెట్టింది. ఇటీవల పాకిస్తాన్ నుండి డ్రోన్ ద్వారా మూడు కిలోల హెరాయిన్ పంజాబ్‌లోకి రాగా, దానిని బీఎస్‌ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.