Jackal attack: ఉత్తరప్రదేశ్ లో నక్కల బీభత్సం.. 12 మందికి గాయాలు

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) వాసులను తోడేళ్ల భయం పీడిస్తుంటే.. ఇప్పుడు కొత్తగా నక్కల దాడి మొదలైంది.

Update: 2024-09-08 06:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) వాసులను తోడేళ్ల భయం పీడిస్తుంటే.. ఇప్పుడు కొత్తగా నక్కల దాడి మొదలైంది. పిలిభిత్ జిల్లాలోని రెండు గ్రామాల్లో నక్కల గుంపు దాడి(jackal attack) చేయడంతో 12 మందికి తీవ్ర గాయలయ్యాయి. వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. జహనాబాద్ ప్రాంతంలోని సుస్వార్(Suswar), పన్సోలి(Pansoli) గ్రామాల్లో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులపై నక్కలు దాడికి పాల్పడ్డాయి. చిన్నారులను రక్షించేందుకు కొందరు వృద్ధులు వెళ్లగా.. వారిపై కూడా ఆ జంతువులు దాడి చేశాయి. గాయపడిన 12 మందిని జహనాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో చికిస పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది.

దర్యాప్తు చేపట్టిన అటవీశాఖ అధికారులు

ఇకపోతే, నక్కల దాడితో కోపోద్రిక్తులైన స్థానికులు వాటిలో ఒకదాన్ని చంపారు. నక్కల దాడి గురించి సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పిలిభిత్ కు పొరుగున ఉన్న బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడిలో చిన్నారులు సహా మొత్తం 10 మంది మరణించారు. తోడేళ్ల దాడిలో మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు సహా దాదాపు 36 మంది గాయపడ్డారు. ఇలాంటి సమయంలోనే పిలిభిత్‌లో నక్కల దాడి జరిగడం గమనార్హం. పిలిభిత్ జిల్లా అటవీ అధికారి (DFO) మనీష్ సింగ్ మాట్లాడుతూ.. తోడేళ్ల గుంపు తరహాలో దాడిజరిగిందని గ్రామస్థులు తెలిపారని పేర్కొన్నారు. "మేము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాము. నక్కలు దూకుడుగా మారాయి. ఎందుకంటే, వర్షం వల్ల నక్కల స్థావరాలు ధ్వంసం అయ్యాయి. దీంతో, బయటకు వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం." అని అటవీ అధికారి మనీశ్ సింగ్ అన్నారు. కాగా, పిలిభిత్ ఎంపీ జితిన్ ప్రసాద నక్కల దాడి గురించి స్థానికులతో ఫోన్‌లో మాట్లాడారు.


Similar News