మెడికోల ఆత్మహత్యలు రిపోర్ట్ రిలీజ్.. ఐదేళ్లలో ఎంతమంది వైద్య విద్యార్థులు చనిపోయారంటే..?
వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి ఆత్మహత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి ఆత్మహత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీనియర్ మెడికో సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన ప్రీతి ఐదురోజులు మృతువుతో పోరాడి ఆదివారం రాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెడికోల ఆత్మహత్యలపై జాతీయ వైద్య మండలి ఓ నివేదికను విడుదల చేసింది. ఇండియాలో గత ఐదేళ్లలో మెడికోల ఆత్మహత్యల జాబితాను సోమవారం జాతీయ వైద్య మండలి రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 119 మంది మెడికోలు ఆత్మహత్య చేసుకున్నారని ఈ సందర్భంగా జాతీయ వైద్య మండలి ప్రకటించింది.
అందులో 64 మంది యూజీలు ఉండగా, 55 మంది పీజీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించింది. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 1,166 మంది విద్యార్థులు మెడిసిన్‌కు గుడ్‌బై చెప్పారని తెలిపింది. యూజీలో 160 మంది, పీజీ జనరల్ సర్జరీలో 114 మంది, ఎంఎస్ ఆర్థోపెడిక్స్‌లో 50 మంది, గైనకాలజీలో 103, ఎంఎస్ ఈఎన్‌టీలో 100, ఎండీ జనరల్ మెడిసిన్‌లో 56, ఎండీ పిడియాట్రిక్స్‌లో 54, ఇతర బ్రాంచ్‌లన్నింటిలో కలపి 529 మంది వైద్యవిద్యను మధ్యలోనే వదిలి వెళ్లిపోయినట్లు జాతీయ వైద్య మండలి వెల్లడించింది.