వాగులో కొట్టుకుపోయిన కారు.. 11 మంది మృతి

ఓ శుభకార్యానికి కారులో వెళ్తున్న వారంతా ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి మరణించారు.

Update: 2024-08-11 14:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఓ శుభకార్యానికి కారులో వెళ్తున్న వారంతా ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి మరణించారు. వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్ లోని భటోలి గ్రామానికి చెందిన 12 మంది ఇన్నోవా కారులో మెహ్రావొల్ గ్రామంలో జరిగే శుభకార్యానికి బయల్దేరి వెళ్తున్నారు. మార్గమధ్యంలో హిమాచల్ ప్రదేశ్-పంజాబ్ సరిహద్దులో గల జైజోన్ గ్రామం వద్ద ఓ వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నప్పటికీ.. ఇతర వాహనాలు వాగును దాటడం చూసి వీరు కూడా ఆ ప్రవాహాన్ని దాటాలని చూశారు. కానీ వాగు ఉదృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. స్థానికులు జేసీబీ సహాయంతో కారును బయటికి తీశారు. అప్పటికే కారులో వారంతా వాగులో కొట్టుకుపోయి, చనిపోయారు. కారు డ్రైవర్ మాత్రం తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తొమ్మిది మంది మృతదేహాలను వెలికి తీయగా, మరో ఇద్దరి ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం సుఖువీందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


Similar News