సీఎం చెప్పినా.. అడుగు ముందుకు పడలేదు..!

దిశ, తెలంగాణ బ్యూరో : ఐదు రోజులైంది. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏ ఒక్క జిల్లాలోనూ పెండింగ్ మ్యూటేషన్లను మొదలు పెట్టిన దాఖలాలూ కనిపించడం లేదు. నెలల తరబడిగా దరఖాస్తులను పెండింగులో ఉంచారు. ఎలాంటి వివాదాలు లేని దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. ప్రతి జిల్లాలో వేలాది మంది దరఖాస్తుదారులు పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. స్టాంపు డ్యూటీ కట్టి భూములను కొనుగోలు చేసినా ధరణి పోర్టల్ లో హక్కులు కల్పించకపోవడంతో భయాందోళనకు […]

Update: 2021-01-15 09:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఐదు రోజులైంది. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏ ఒక్క జిల్లాలోనూ పెండింగ్ మ్యూటేషన్లను మొదలు పెట్టిన దాఖలాలూ కనిపించడం లేదు. నెలల తరబడిగా దరఖాస్తులను పెండింగులో ఉంచారు. ఎలాంటి వివాదాలు లేని దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. ప్రతి జిల్లాలో వేలాది మంది దరఖాస్తుదారులు పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. స్టాంపు డ్యూటీ కట్టి భూములను కొనుగోలు చేసినా ధరణి పోర్టల్ లో హక్కులు కల్పించకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. విక్రయించిన వారి పేరిటే ధరణిలో కొనసాగుతుండడంతో ఏ క్షణం ఏం వినాల్సి వస్తోందనన్న ఆందోళన నెలకొంది. భూముల విలువలు పెరిగిన నేపథ్యంలో అక్రమాలకు పాల్పడే అవకాశమూ లేకపోలేదు. భూములను కొనడానికి రూ.లక్షలు వెచ్చించినా పాసు పుస్తకాలు పొందలేకపోవడంతో ఉక్కిబిక్కిరవుతున్నారు. ఈ అంశాన్ని తహసీల్దార్లు గుర్తించినా దరఖాస్తుదారుల ఆవేదన, ఆందోళనకు విముక్తి కలిగించడం లేదు. నెలల తరబడి మ్యూటేషన్లు చేయకుండా పెండింగ్​లో ఉంచడంపై ఎంత టెన్షన్ వాతావరణం నెలకొంటుందన్న అంశాన్ని కలెక్టర్లకు చెప్పడం లేదు.

టైం లేదు..

రాష్ట్రవ్యాప్తంగా మ్యూటేషన్ ఫైళ్లు లక్షకు పైగా పెండింగులో ఉన్నాయి. వీటిలో ఒకటీ రెండు శాతం మాత్రమే వివాదాస్పదం. మిగతా వాటిలో ఎలాంటి పేచీలు లేవు. ధరణి పోర్టల్ ద్వారా ఆప్షన్లు ఇచ్చినప్పటికీ సాంకేతిక సమస్యలు పొంచి ఉన్నాయని తహసీల్దార్లు చెబుతున్నారు. తహసీల్దార్ లాగిన్ నుంచి కలెక్టర్ లాగిన్ లోకి పంపినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వాటన్నింటినీ కలెక్టర్లు స్వయంగా పరిశీలించి ఆమోదం తెలుపుతూ తిరిగి తహసీల్దార్లకు పంపాలి. కానీ కలెక్టర్లకు విపరీతమైన పనులు ఉండడంతో పరిశీలించడం లేదని తెలుస్తోంది. 11వ తేదీన సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించినా ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తును కూడా పరిశీలించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయలేమని కలెక్టర్లు కూడా సీఎం కు వాస్తవాన్ని చెప్పలేదు. కలెక్టర్లకు రోజూ ఉండే విధులతో పాటు స్వయంగా పెండింగ్ ఫైళ్లన్నింటినీ పరిశీలించడం సాధ్యం కాదని ఉద్యోగులు, అధికారులందరికీ తెలుసు. కానీ ఉన్నతాధికారుల ఆదేశాలతోనే సీఎం కేసీఆర్ కు పెండింగ్ అంశాల పరిష్కారానికి పట్టే సమయాన్ని, సాంకేతిక సమస్యలు, సాధ్యాసాధ్యాలను వివరించలేదని తెలిసింది. కనీసం డీఆర్వో పోస్టుల అవసరాన్ని కూడా చెప్పలేకపోయారు. కానీ స్పెషల్ ట్రిబ్యునళ్లలో మాత్రం డీఆర్వో పోస్టుకు ప్రాధాన్యత కల్పించారు. ఎవరైనా ఎకరం భూమి కొనుగోలు చేస్తే భూ హక్కులు మార్పిడి చేసేందుకు రూ.2,500 చార్జీలు చెల్లించాల్సిందే. పోస్టల్ చార్జీలు, పట్టాదారు పాసు పుస్తకాల కోసం అదనంగా చెల్లించాలి. గతంలో ఎప్పుడూ చార్జీలు విధించలేదు. రైతులకు అన్నీ ఉచితంగానే చేశారు. ఐనా పనులు మాత్రం పెండింగులోనే ఉంచుతుండడం విడ్డూరంగా ఉందని దరఖాస్తుదారులు మండిపడుతున్నారు.

వాస్తవాలు చెప్పని కలెక్టర్లు..

ప్రభుత్వానికి ధరణి పోర్టల్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. కానీ సక్సెస్ అయ్యేందుకు మార్గాలను మాత్రం అన్వేషించడం లేదు. చివరకు సీఎం కేసీఆర్ సమీక్షించిప్పుడు కూడా వాస్తవాలను వెల్లడించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సమీక్షలో సీఎంతో ఏం మాట్లాడొద్దని, ఎలాంటి సమస్యలను చెప్పొద్దని ఓ ముగ్గురు ఐఏఎస్ అధికారులు మిగతా వారికి ఫోన్లు చేసి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే సమీక్షలో ప్రస్తావించాలనుకున్న సమస్యలను కూడా దాచి పెట్టారని ఓ అధికారి చెప్పారు. ప్రధానంగా పెండింగ్ మ్యూటేషన్ల పరిష్కార బాధ్యత తహసీల్దార్ల చేతిలోనే ఉండాలని, క్షేత్రస్థాయిలో కలెక్టర్లర్లు తనిఖీ చేయలేరని, పరిశీలించలేరని సీఎం కు చెప్పలేదన్నారు. కనీసం జిల్లాకో డీఆర్వో ఉండాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్ ను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. లక్షకు పైగా దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించేందుకు ఎంత సమయం పడుతుంది? మరింత ఆలస్యమైతే దరఖాస్తుదారుల నుంచి వ్యతిరేకత వస్తుంది? అన్న అంశాలను సమీక్షలో ప్రస్తావనకు రాకపోవడం వల్లే వారం రోజుల్లో అన్నీ పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారని సమాచారం.

సీఎం ఆమోదించినా..

ఏజీపీఏ, జీపీఏల నుంచి సాగు భూములను కొనుగోలు చేసిన వారికి కూడా హక్కులను కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పుడు వారికి పట్టాదారు పాసు పుస్తకమే లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏజీపీఏ, జీపీఏలు చేసుకున్న వారు సైతం ఆందోళనలోనే ఉన్నారు. ధరణికి ముందే కొనుగోలు చేసిన ఏజీపీఏ హోల్డర్లకు కొత్త కష్టాలు తప్పేటట్లు లేవు. రెవెన్యూ రికార్డుల్లోకి వారి పేర్లను నమోదు చేయించుకోవాల్సిన అవసరం వారికి లేదు. సేల్ డీడ్ తోనే సబ్ రిజిస్ట్రార్ దగ్గర మరొకరికి అమ్మే హక్కులు ఉండేవి. ఇప్పుడు ఏనాడో అమ్మిన రైతుల దగ్గరికి మళ్లీ ఫైళ్లు తీసుకెళ్లేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన లభిస్తుందోనని కలవరపడుతున్నారు.

ఎన్ఆర్ఐలకూ ఏవి..?

ఎన్ఆర్ఐలు కొనుగోలు చేసిన భూ హక్కులకు ఢోకా లేకుండా చేయాలని సీఎం ఆదేశించారు. వారి పాస్​ పోర్టుతో పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయాలని సూచించారు. అధికారులు మాత్రం నేటికీ ఆ ప్రక్రియను మొదలుపెట్టలేదు. ఆఖరికి ధరణి పోర్టల్ అమలుకు ముందు మ్యూటేషన్లు చేయించుకున్న వారికి కేవలం డిజిటల్ సంతకం పెట్టని కారణంగా పాసు పుస్తకాలు నిలిచిపోయాయి. వాటికి కూడా మోక్షం కలగడం లేదు. వాళ్లందరూ ఆధార్ కార్డు నంబరుతో సహా కేవైసీని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. కానీ ధరణి పోర్టల్ లో డిజిటల్ సంతకం ఆప్షన్లు ప్రకటించకపోవడంతో ఎలాంటి పరిష్కార మార్గం కనిపించడం లేదని తహసీల్దార్లు చెబుతున్నారు. ఎలాంటి వివాదాలు లేకపోవడంతో మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇప్పుడు వాటిని కూడా కలెక్టర్లు పరిశీలించిన తర్వాతే అంటున్నారు.

Tags:    

Similar News