డీల్ లేక డీలా!
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన ఆద్యంతం అద్భుతంగా సాగినట్టు కనిపిస్తుంది. ట్రంప్ ఎక్కడ మాట్లాడినా మోడీని ప్రశంసల్లో ముంచెత్తడం.. హాజరైన ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తమవడం పర్యటన గ్రాండ్ సక్సెస్‌కు గీటురాయిగా మారింది. పర్యటన తుదకంటా.. ట్రంప్, మోడీల మధ్య సాన్నిహిత్యం ఊహించిన దానికంటే బలంగా ఉన్నదని, దానితో భారత్‌కు ఎంతో మేలు చేకూరుతుందన్నట్టు చాలామందిలో ఆశలు చిగురించాయి. అందుకు అనుగుణంగానే భారత్‌కు తన హృదయంలో ప్రత్యేక స్థానముంటుందని ట్రంప్ చెప్పుకురావడం, భవిష్యత్‌లో […]
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన ఆద్యంతం అద్భుతంగా సాగినట్టు కనిపిస్తుంది. ట్రంప్ ఎక్కడ మాట్లాడినా మోడీని ప్రశంసల్లో ముంచెత్తడం.. హాజరైన ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తమవడం పర్యటన గ్రాండ్ సక్సెస్‌కు గీటురాయిగా మారింది. పర్యటన తుదకంటా.. ట్రంప్, మోడీల మధ్య సాన్నిహిత్యం ఊహించిన దానికంటే బలంగా ఉన్నదని, దానితో భారత్‌కు ఎంతో మేలు చేకూరుతుందన్నట్టు చాలామందిలో ఆశలు చిగురించాయి. అందుకు అనుగుణంగానే భారత్‌కు తన హృదయంలో ప్రత్యేక స్థానముంటుందని ట్రంప్ చెప్పుకురావడం, భవిష్యత్‌లో భారీ డీల్స్ తప్పకుండా ఉంటాయని ప్రకటించడమూ కన్విన్స్ చేశాయి. కానీ, 2018 నుంచి ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్యపరమైన అడ్డంకుల పరిష్కారానికి ఒక్క ముందడుగూ పడలేదని తెలిస్తే ఎలా ఉంటుంది?
రక్షణ రంగ డీల్(రూ. 21వేల కోట్ల రక్షణ హెలికాప్టర్ల ఒప్పందం లేదా మూడు బిలియన్ డాలర్ల డీల్), మూడు ఎంఓయూలు మినహా ఒక్కటంటే ఒక్క ట్రేడ్ డీల్ కూడా యూఎస్ అధ్యక్షుడి పర్యటనలో కుదరలేదు. ఇరుదేశాల మధ్య ఏర్పడ్డ 25 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును పూడ్చుకునేందుకు ఆర్థిక నిపుణులు ఊహించిన భారీ డీల్ పత్తా లేకుండా పోయింది. పైనకు గంభీరంగా, బ్రహ్మాండంగా పర్యటన జరిగినట్టు కనిపిస్తున్నా ఇరుదేశాల మధ్య నెలకొన్న టారిఫ్ గొడవ ఏమాత్రం సద్దుమణగలేదు. 2018 నుంచి రెండుదేశాల దౌత్యవేత్తలు, వ్యాపారులు ఆశించిన ఫలితాలు ఈ పర్యటనలో సమకూరనేలేదు.
2018లో అమెరికా.. భారత్‌ను అభివృద్ధి చెందిన జాబితాలో చేర్చి మన దేశ ఎగుమతులపై సుంకం వసూలు చేయడం మొదలుపెట్టింది. ప్రతిగా భారత్ కూడా అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నది. భారత్ తమ ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా ఉంటుందని ప్రకటించిన ట్రంప్.. దీనిపై మాత్రం నోరుమెదపలేదు. ఇరుదేశాలు వాటి మధ్య సుంకాల అడ్డంకులు దాటుకుని పరస్పరం ప్రయోజనం కలిగే పరిష్కారానికి చేరలేకపోయాయి. పైనకు ఇరువురు నేతలు లౌక్యాన్ని ప్రదర్శించినా వాణిజ్యాంశాల్లో మాత్రం ఇరుదేశాలు పట్టువీడలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అందరూ ఊహించిన భారీ డీల్స్ ఆమడదూరంలోనే నిలిచిపోయింది. దీంతో ట్రంప్‌ను స్వాగతించేందుకు కోటిమంది వస్తారన్న మాటలాగే పర్యటనకు ముందున్న అంచనాలన్నీ తప్పాయన్న చర్చ నడుస్తున్నది.
కానీ, ఈ పర్యటన ట్రంప్, మోడీ ఇరువురికి ప్రయోజనకరంగా సాగింది. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు, అలాగే ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ ఆందోళనల నేపథ్యంలో మసకబారుతున్న నరేంద్ర మోడీ చరిష్మా తిరిగి బలపడేందుకు ఈ పర్యటన ఇరువురికి ఒక వేదికగా పనికొచ్చిందని విశ్లేషకులు చర్చిస్తున్నారు. ట్రంప్ మంచి వ్యూహకర్త, అమెరికాకు లబ్ది చేకూర్చే డీల్స్ చేయడంలో దిట్ట అనే ముద్రపడేలా.. అలాగే, విదేశాల్లో మంచి ఆదరణ ఉన్నదని చూపించుకోవాలని ఆయన భావించి ఉండొచ్చని, అందులో ఓ మేరకు సఫలమయ్యారనీ విశ్లేషకులు చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయులను ఆకర్షించేందుకు మోడీతో సాన్నిహిత్యం, అమెరికన్లపై గురితప్పకుండా ఉండేందుకు వాణిజ్య ఒప్పందాలను దూరం పెట్టి ఉండొచ్చని చర్చిస్తున్నారు.