‘దిశ’ సమావేశ నిర్వహణకు మొగ్గు చూపని ఎంపీ రేవంత్ రెడ్డి

దిశ ప్రతినిధి, మేడ్చల్: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమీక్ష సమావేశాలను అటకెక్కించారు. గతంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ ఉండగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దీన్ని జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ)గా మార్చింది. స్థానిక పార్లమెంట్ సభ్యుడి అధ్యక్షతన ప్రతి మూడు నెలలకొకసారి నిర్వహించే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై సమీక్షిస్తారు. కానీ మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో దాదాపు రెండేళ్లుగా దిశ సమావేశాన్ని నిర్వహించలేదని అధికారులే చెబుతున్నారు. […]

Update: 2021-12-15 06:40 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమీక్ష సమావేశాలను అటకెక్కించారు. గతంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ ఉండగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దీన్ని జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ)గా మార్చింది. స్థానిక పార్లమెంట్ సభ్యుడి అధ్యక్షతన ప్రతి మూడు నెలలకొకసారి నిర్వహించే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై సమీక్షిస్తారు. కానీ మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో దాదాపు రెండేళ్లుగా దిశ సమావేశాన్ని నిర్వహించలేదని అధికారులే చెబుతున్నారు.

ప్రతి మూడు నెలలకొకసారి..

దిశ సమీక్ష సమావేశ నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఈ కమిటీ సమావేశాలు ఏప్రిల్, జూలై, అక్టోబర్,ఫిబ్రవరిలో స్థానిక పార్లమెంట్ సభ్యుడి అధ్యక్షతన ఖచ్చితంగా నిర్వహించాలని కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం జిల్లాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమీక్షిస్తారు. జిల్లాకు చెందిన మంత్రితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. జిల్లలోని 28 కీలక శాఖలకు చెందిన అధికారులు పాల్గొంటారు.

ప్రతి సమావేశానికి రూ.2 లక్షలను వెచ్చిస్తారు. సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులకు రవాణా ఖర్చులను కూడా చెల్లిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయ పరిచి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు దిశ సమీక్ష సమావేశ ముఖ్యోద్దేశం. కేంద్రానికి సంబంధించిన పథకాల అమలు తీరు తెన్నులను పార్లమెంట్ సభ్యుడు సమీక్షించే అవకాశం ఉంటుంది. జిల్లాలోని అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల మంజూరు విషయంలో జాప్యం జరిగినా.. స్థానిక ఎంపీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మంజూరు చేయించే అవకాశం ఉంటుంది.

స్థానిక సమస్యలపై పట్టింపేది..?

మేడ్చల్ జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్లమెంట్ సభ్యుడిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతననే ఈ దిశ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. కానీ రెండేళ్లుగా నిర్వహించకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక అనే నినాదంతో ఎంపీగా గెలుపొందిన రేవంత్ రెడ్డి స్థానిక సమస్యలను పక్కన పెట్టి, రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడంతో పాటు.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతున్నాడు. కానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో సమస్యలపై పట్టించుకోవడం లేదన్న విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి.

పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు జిల్లా వాసులను వెంటాడుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్ నిర్మించినా.. లబ్దిదారులకు కేటాయించడం లేదు. ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో పేదలు కాలం వెల్లదీస్తున్నారు. సుచిత్ర, కొంపల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. రెండో దశ ఎంఎంటీఎస్ పనులు, రైల్వే ప్రాజెక్ట్ లు నత్తనడకన సాగుతున్నాయి. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యార్డు నుంచి వస్తున్న దుర్గంధాన్ని భరించలేక దమ్మాయిగూడలో సొంత ఇళ్లను ఖాళీ చేసి వెళ్లి పోతున్నారు.

జిల్లాలో పరిశ్రమల వల్ల వెదజల్లుతున్న కాలుష్యంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. జాతీయ రహదారులు, ఇంధన ఉత్పత్తులు, టెలిఫోన్ సమస్యలు లాంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది. నేషనల్ హౌసింగ్ స్కీమ్ (రూరల్, అర్బన్) ధీన్ దయాల్ ఉపాధ్యాయ జీవన్ క్రాంతి యోజన లాంటి 28 రకాల పథకాల అమలుపై చర్చించే అవకాశం ఉంటుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా వాతావరణ కాలుష్యం రాకుండా ఎంపీ రేవంత్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టంను వినియోగించుకుని ఎన్నో రకాల సమాచారాన్ని తెప్పించుకునే రేవంత్ రెడ్డి, జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఎక్కడ స్పందించిన అనవాళ్లు కనిపించడంలేదని జిల్లా ప్రజలు వాపోతున్నారు.

Tags:    

Similar News