వెండితెరకు సాంకేతిక సొబగు..
కొత్త సాంకేతికతను వెండి తెరకు కృష్ణ పరిచయం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: కొత్త సాంకేతికతను వెండి తెరకు కృష్ణ పరిచయం చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలుగు పరిశ్రమలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. తొలి జేమ్స్ బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్లకు మోసగాడు), తొలి ఫుల్ స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలు కావడం విశేషం. 1976-1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు అందుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్లకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశాడు. ఇందు కోసం మూడు షిఫ్టుల్లో ఆయన పని చేసే వారు. తాను బీఏ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమాల్లోకి రావాలని కృష్ణ నిర్ణయించుకున్నారు. కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. అతను అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలివచ్చారంటే అప్పుడే ఆయన క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.