Super Star Krishna: కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
వెండితెరపై అనేక ప్రయోగాలతో సినీ వినీలాకాశంలో ఒక వెలుగు వెలిగిన కృష్ణ(79) కన్నుమూశారు.
దిశ, వెబ్ డెస్క్: వెండితెరలో అనేక ప్రయోగాలతో సినీ వినీలాకాశంలో ఒక వెలుగు వెలిగిన కృష్ణ(79) కన్నుమూశారు. మంగళవారం వేకువజామున సూపర్ స్టార్ కృష్ణ(79) గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు.
కార్మిక, కర్షక లోకానికి నిజమైన హీరో: సీఎం కేసీఆర్
సూపర్ స్టార్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాటి కార్మిక, కర్షక లోకం ఆయన్ను తమ అభిమాన హీరోగా కృష్ణను ఆరాధించేవారన్నారు. సూపర్ స్టార్ గా కీర్తించేవారన్నారు. సొంత నిర్మాణ సంస్థ స్థాపించి సినిమా రంగంలో నూతన ఒరవడులను ప్రవేశపెట్టిన ఘనత కృష్ణదేనన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రజలకు సామాజిక స్పృహ కలిగించే సాంఘిక చిత్రాల నటుడిగా విశేష జనాధరణ పొందారని గుర్తు చేశారు.
తెలుగువారికి తీరని లోటు: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణ మరణం తెలుగు సినీరంగానికి, తెలుగువారికి తీరని లోటు అని అంధ్రప్రదేశ్ సీఎం జగన్ అన్నారు. కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని కాంక్షించారు. నిజ జీవితంలో కృష్ణ మనసున్న మనిషి అన్నారు. కృష్ణ ఆంధ్రా జేమ్స్ బాండ్ గా పేరు సంపాదించారన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
యువశక్తికి చిహ్నంగా పాత్రలు.. : వెంకయ్య నాయుడు
కృష్ణ నటించిన పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు తెరపై సూపర్ స్టార్ కృష్ణ స్ఫూర్తి అజరామరమని అన్నారు.
ఇవి కూడా చదవండి:
రాజకీయాల్లో సూపర్ స్టార్ ప్రస్థానం..
ఇంట్లో గొడవలతోనే సూపర్ స్టార్ కృష్ణకు హార్ట్ ఎటాక్ వచ్చిందా?