ఆగస్ట్ 15 తర్వాత కొత్త సినిమా షూటింగ్‌లు బంద్.. నిర్మాతల మండలి సంచలన నిర్ణయం

తమిళ నిర్మాతల మండలి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్‌లు తీసుకుని సినిమా షూటింగ్‌లు పూర్తి చేయని యాక్టర్లపై చర్యలు

Update: 2024-07-29 12:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళ నిర్మాతల మండలి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్‌లు తీసుకుని సినిమా షూటింగ్‌లు పూర్తి చేయని యాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ 15 తర్వాత కొత్త సినిమా షూటింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యాక్టర్లు అంతా ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమా షూటింగ్‌లు ప్రారంభించాలని సూచించింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సినిమా షూటింగ్‌లన్నీ అక్టోబర్ 31 తేదీ వరకు పూర్తి చేయాలని ప్రొడ్యూసర్స్, యాక్టర్స్‌ను ఆదేశించింది. ఈ మేరకు పెండింగ్ మూవీలు, ఇచ్చిన అడ్వాన్స్‌లకు సంబంధించిన వివరాలు అందించాలని నిర్మాతలకు సూచించింది. ఇక నుండి నటీనటులు ఒక సినిమా పూర్తయ్యాకే మరో మూవీకి కాల్ షీట్లు ఇవ్వాలని సూచించింది. ఇకపై తమిళ స్టార్ హీరోల సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని పేర్కొంది.

ఒకేసారి రెండు, మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుని నిర్మాతలను ఆర్థిక ఇబ్బందులకు గురి చెయొద్దని హెచ్చరించింది. ఇకపై ఏ హీరో, హీరోయిన్ అడ్వాన్స్‌లు తీసుకుకుండా నిషేదం విధించింది. ఈ క్రమంలోనే తమిళ్ స్టార్ హీరో ధనుష్‌పై నిర్మాతల మండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్వాన్స్‌లు తీసుకుని షూటింగ్‌లు పూర్తి చెయ్యడం లేదని ధనుష్‌పై ఫిర్యాదులు రావడంతో ఇకపై నిర్మాతల మండలి పర్మిషన్ ఉంటేనే ధనుష్‌తో సినిమాలు తీయాలని నిర్మాతలకు సూచించింది. నిర్మాతల మండలి తీసుకున్న ఈ సంచలన నిర్ణయాలు కోలివుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అడ్వాన్స్‌లు తీసుకోవద్దు, ఒకేసారి రెండు, మూడు సినిమాల్లో నటించకూడదు అన్న నిర్మాత మండలి నిర్ణయాలపై కొందరు యాక్టర్స్ అసహనం వ్యక్తం చేశారు. 


Similar News