Samantha: సమంత నాకు అక్క లాంటిది.. కొండా సురేఖ చేసింది తప్పు: శ్రీకాంత్ ఓదెల (ట్వీట్)
మంత్రి కొండా సురేఖ నటి సమంతపై చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తూ సెలబ్రిటీలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
దిశ, సినిమా: మంత్రి కొండా సురేఖ నటి సమంతపై చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తూ సెలబ్రిటీలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి కొండా సురేఖపై ఎంతో మంది స్టార్స్ మండిపడుతూ పోస్టులు పెడుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల ‘X’ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘‘ముఖ్యంగా గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి నుండి ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు వినడం చాలా దురదృష్టకరం. అధికారం, పదవి మీ గౌరవాన్ని కొనలేవు. రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. 365 డేస్ ప్రతిరోజు సమంతను దగ్గరగా చూసిన ఒక అభిమానిగా చెప్తున్నా. సమంత Telugu సినిమా ఇండస్ట్రీ దొరికిన వరం.
ఒక ఆర్టిస్ట్‌గానే కాదు, ఒక వ్యక్తిగా కూడా తను మా ఇంట్లో అక్కలా అనిపించేవారు. నాకు సురేఖ గురించి కానీ, సమంత గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. కానీ సురేఖ మాట్లాడింది మాత్రం కరెక్ట్ కాదు. సామ్‌పై అలాంటి కామెంట్లు చేసి తప్పు చేసింది. సినిమా పరిశ్రమలో పనిచేయాలనుకునే వారి కలలను కొనసాగించాలనుకునే మహిళలకు తగినంత ప్రతిబంధకాలు ఉన్నాయి. ఇలాంటి చౌకబారు, అవమానకరమైన వ్యాఖ్యలు ఆ భయాలను పెంచుతాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, స్త్రీ పురుష అసమానతలు అన్ని చోట్లా ఉన్నాయి.
మహిళలు చేయాల్సిందల్లా స్వతహాగా ఎదగడమే. మహిళలందరూ ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలను విస్మరించి, అందరూ తప్పు అని నిరూపించడానికి పరిశ్రమలోకి రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సినిమా అనేది ఒక కళారూపం. మీరు గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ సినీ పరిశ్రమలో వర్క్ చేస్తున్న వారిని అగౌరవపరిచే ప్రయత్నం చేయకండి. బతుకమ్మ అంటేనే ఆడది అంటారు. అలాంటి బతుకమ్మ జరుగుతున్న ఈ టైంలో ఇలాంటి ఇష్యూ రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది’’ అని అన్నారు. ప్రజెంట్ డైరెక్టర్ ట్వీట్ వైరల్ అవుతోంది.