Special Story : టాలీవుడ్‌లో నయా ట్రెండ్.. థియేటర్లలో కేక పుట్టిస్తున్న పాత సినిమాలు

సినిమా అంటేనే వినోదం. అందులోనూ కొన్ని సినిమాలు ఎప్పుడు చూసినా ఫ్రెష్‌గానే అనిపిస్తుంటాయి.

Update: 2024-09-24 11:08 GMT

సినిమా అంటేనే వినోదం. అందులోనూ కొన్ని సినిమాలు ఎప్పుడు చూసినా ఫ్రెష్‌గానే అనిపిస్తుంటాయి. అలాంటి సినిమాలు కొత్త 4కే టెక్నాలజీ.. డీటీఎస్ సౌండ్ లో చూస్తుంటే అభిమానులకు పూనకాలు రాకుండా ఉంటాయా? ఇప్పుడు ఇదే పాయింట్ పై నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. నిర్మాతలు, డబ్బుల సంగతి ఎలా ఉన్నా.. అభిమానులు మాత్రం తీన్మార్ స్టెప్పులతో ఫేవరెట్ హీరో ఓల్డ్ సినిమాను స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కొత్త సినిమాలతోపాటు పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్నది. అప్పట్లో అగ్రహీరోలు నటించిన అనేక సినిమాలను ప్రస్తుతం తిరిగి ప్రదర్శిస్తున్నారు. హీరోల పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మార్కెట్‌లో మంచి సినిమాలు లేక పోవడంతో పాత సినిమాలను రీ మాస్టరింగ్ చేసి రీల్స్ క్వాలిటీ పెంచి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలు ముందు ఎంతైతే కలెక్షన్లు సాధించాయో.. దాదాపు అంతే కలెక్షన్లను ప్రస్తుతం సాధిస్తున్నాయి. ప్రేక్షకులు సైతం తమ అభిమాన హీరోలు నటించి.. ఆనాడు బ్లాక్ బ్లస్టర్లుగా నిలిచిన సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. ఫ్యామిలీస్‌తో పాటు కలిసి వచ్చి మూసీ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. - నిసార్

రీరిలీజ్ అయిన కొన్ని సినిమాలు

ఇటీవలి కాలంలో రీరిలీజ్ ట్రెండ్ కామన్ అయ్యింది. మాయాబజార్ లాంటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కూడా కలర్ లో రావడంతో థియేటర్ లలో హల్‌చల్ చేసింది. 2022లో పోకిరీ సినిమా రీరిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతోపాటు మహేశ్ బాబుకి చెందిన ఒక్కడు, మురారి, బిజినెస్ మెన్ లు రీరిలీజ్ అయ్యాయి. ఈ జోనర్ లో పవన్ కళ్యాణ్ సినిమాలు జల్సా, తమ్ముడు, ఖుషి, గబ్బర్ సింగ్, తొలిప్రేమ రాగా, సింహాద్రి (జూనియర్ ఎన్టీఆర్), ఇంద్ర (చిరంజీవి), ఆరెంజ్ (రామ్ చరణ్), ఈ నగారానికి ఏమైంది (విశ్వక్ సేన్), 7/G బృందావన్ కాలనీ (రవికృష్ణ), ఓయ్ (సిద్దార్థ్), దేశముదురు (అల్లు అర్జున్), చెన్నకేశవ రెడ్డి (బాలకృష్ణ), బిల్లా (ప్రభాస్), వెంకీ (రవితేజ), మాస్ (నాగార్జున), ఎటో వెళ్లిపోయింది మససు (నాని), మాస్ (నాగార్జున) సినిమాలు చేరాయి.

భారీగా వసూళ్లు

మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో 2001 ఆగస్టు 9న రిలీజ్ అయిన మురారి సినిమా అప్పట్లోనే భారీ వసూళ్లు వసూలు చేసింది. ఇందులోని పాటలు, సన్నివేశాలు, హీరో మహేశ్ బాబు, హీరోయిన్ సొనాలీబింద్రె యాక్షన్ అందరినీ కట్టి పడేసింది. అన్ని థియేటర్లలోనూ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇదే సినిమాను రీరిలీజ్‌లో చేశాక మొత్తంగా రూ.8.52 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సినిమా మొదటి రోజే రూ.2.93 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 2022లో రీరిలీజ్ కాగా, ఓ జంట థియేటర్ అలనాటి రామచంద్రుడు పాట వస్తుండగా పెండ్లి చేసుకోవడం మరో సంచలనంగా మారింది. 2001 ఏప్రిల్ 26న పవన్ కళ్యాణ్, భూమిక హీరో హీరోయిన్లుగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రిలీజ్ అయిన ఖుషీ సినిమా సైతం రీరిలీజ్‌లో రూ.7.46 కోట్లు వసూలు చేసి రెండో ప్లేస్‌లో నిలిచింది.

ఈ సినిమా రీరిలీజ్‌ అయిన ఫస్ట్ డే రోజునే రూ.1.65 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. 2012 జూన్ 13న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘బిజినెస్ మ్యాన్’ సినిమా సైతం రీరిలీజ్‌లో రూ.5.85 కోట్ల కలెక్షన్ సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం రీరిలీజ్ ఫస్ట్ డేన రూ.2.46 కోట్లు వసూలు చేసింది. ఇక జూనియర్ ఎన్‌టీఆర్ హీరోగా 2003 జూలై 9న రాజమౌళి దర్శకత్వంలో రిలీజ్ అయిన ‘సింహాద్రి’ సినిమా రీరిలీజ్‌లో రూ.4.60 కోట్ల కలెక్షన్ సాధించి ఫోర్త్ ప్లేస్‌ సొంతం చేసుకున్నది. ఈ చిత్రం రీ‌రిలీజ్ ఫస్ట్ డే రోజున రూ.1.06 కోట్ల కలెక్షన్స్ సాధించింది. 2018 జూన్ 29న తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా రీరిలీజ్‌లో రూ.3.52 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా మొదటి రోజున రూ.81 లక్షలు వసూలు చేసింది. వీటితో పాటు అనేక సినిమాలు రీరిలీజ్ సందర్భంగా మంచి వసూళ్లు సాధించాయి.

రీరిలీజ్‌కు రీజన్స్

టాలీవుడ్‌లో కొన్ని రోజుల నుంచి మంచి సినిమాలు లేక పోవడం, ఫ్యామిలీ బేసెస్ చిత్రాలు తీయక పోవడంతో అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేసిన సినిమాలను ప్రస్తుతం రీరిలీజ్ చేస్తున్నారని తెలుస్తున్నది. ఇంకో వైపు పెద్ద హీరోల బర్త్‌డేల సందర్భంగా, ఆనాటి తీపి గుర్తులను గుర్తు చేసుకునేందుకు కొన్ని సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. నాడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు తిరిగి రిలీజ్ చేయడం వల్ల భారీ వసూళ్లూ చేసుకోవచ్చని నిర్వాహకులు సైతం ఈ తరహా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. యూట్యూబ్‌లోనో, ఇతర టీవీ ఛానళ్లలో ఇప్పటి యువత పాత సినిమాలు చూసి అంతటి మంచి సినిమా చూడలేక పోయామని ఫీలింగ్ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో థియేటర్లలో రీరిలీజ్ కావడంతో వెంటనే వచ్చి చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

రీమాస్టరింగ్ చేసి..

15 నుంచి 20 ఏళ్ల క్రితం సినిమాలన్నీ రీళ్ల ద్వారా తీసేవారు. మారిన టెక్నాలజీతో పోలిస్తే.. అవి ఇప్పుడు థియేటర్లలో ప్రదర్శించడం కష్టం. ఈ క్రమంలో రీళ్లను 4కే విజులవల్స్‌లోకి తీసుకొచ్చి పిక్చర్, సౌండ్ క్వాలిటీని పెంచుతున్నారు. కొన్ని రీళ్లు అరిగిపోయి డిస్ ప్లే చేయడానికి వీలు కాక పోవడంతో వాటిని 8కే టెక్నాలజీ ఉపయోగించి సరి చేస్తారు. ఇలా చేసేందుకు సుమారు రెండు నెలల నుంచి ఆరు, ఏడు నెలలు పట్టే అవకాశం ఉంటుంది. ఖర్చు సైతం భారీగానే అవుతుందని తెలుస్తున్నది.

బాలీవుడ్‌లోనూ ట్రెండ్

తెలుగులోనే కాదు హిందీ సినిమాల్లోనూ రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్నది. అక్కడ సైతం కొత్త సినిమాలకు ఆదరణ లేక పోవడంతో కలెక్షన్లు భారీగా పడిపోవడంతో పాత సినిమాలను తిరిగి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, మొహబ్బతే, మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై కౌన్ వంటి చిత్రాల్లో కొన్ని రిలీజ్ అవ్వగా.. మరికొన్ని త్వరలో కానున్నాయి. 2012లో తీసిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్’ సినిమా అప్పట్లో పెద్దగా ఆడలేదు. 2018లో తీసిన లైలా మజ్ను సినిమా సైతం నిరాశపర్చింది. కానీ ఈ సినిమాలు ఇటీవల రీరిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లు సాధించాయి.

Tags:    

Similar News