Devara Movie: సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేసిన ఎన్టీఆర్..
ఎన్టీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేసారు.
దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల అవుతుండటంతో నందమూరి అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. థియేటర్స్ వద్ద బ్యానర్లు కూడా పెడుతున్నారు. ఇక పెద్ద మూవీ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతకముందు ఉన్న టికెట్ రేట్లు పెంచి ఎక్స్ ట్రా షోలకు కూడా అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే ఏపీలో దేవరకు పర్మిషన్ ఇవ్వడంతో ఎన్టీఆర్, మూవీ యూనిట్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసారు.
తాజాగా, తెలంగాణలో కూడా ఎన్టీఆర్ దేవర మూవీకి అనుమతులు ఇచ్చారు. టికెట్ పెంపు, ఎక్స్ ట్రా షోలకు ఓకే చెప్పింది ప్రభుత్వం. మొదటి రోజు అన్ని షోలకు రూ. 100 వరకు టికెట్ రేటు పెంచుకోవచ్చు. అలాగే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 25 రూపాయలు, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 50 టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఎన్టీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేసారు.
ఎన్టీఆర్ " గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి దేవర కోసం అనుమతులు ఇస్తూ GO రిలీజ్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు సినీ పరిశ్రమకు మీ సపోర్ట్ కు నా కృతజ్ఞతలు " అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు.