Trisha Krishnan: మహేష్ బాబుతో కాలేజ్ డేస్ నుంచే పరిచయం ఉంది.. అసలు విషయం బయటపెట్టిన త్రిష!
త్రిష ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణిస్తోంది.
దిశ, సినిమా: త్రిష ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. తమిళ, తెలుగు స్టార్ హీరోల సరసన నటించిన ఆమె ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుని సత్తా చాటింది. అంతేకాకుండా ప్రేక్షకుల్లో ఎంతోమంది అభిమానులను దక్కించుకుంది. ప్రజెంట్ ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025లో జనవరి 10న విడుదల కానుంది. అలాగే త్రిష అజిత్ సరసన విడాముయర్చి మూవీలో కూడా నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ స్టార్ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నాకు నచ్చిన నటుల్లో మహేష్ బాబు ఒకరు. ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తోటి నటీనటులను చాలా గౌరవిస్తారు. షూటింగ్ సెట్లో కూడా చాలా సరదాగా ఉంటారు. అలాగే చాలా హార్డ్ వర్క్ చేస్తారు. తన సీన్స్ షూట్ చేయడం అయిపోగానే కారవాన్లోకి వెళ్లకుండా మానిటర్ దగ్గర కూర్చొని అన్నీ గమనిస్తూ ఉంటారు.
అయితే ఎవరికీ తెలియని విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మహేష్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. మేమిద్దరం కాలేజ్ డేస్లో చెన్నైలో ఉన్నాం. అయితే అక్కడ మా ఇద్దరి మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా నాకు మహేష్ బాబుతో పరిచయం ఏర్పడింది. మేము యాక్టర్స్ అవుతామని అప్పుడు అనుకోలేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ త్రిష కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. ఈ విషయం తెలిసిన వారు ఆశ్చర్యపోతున్నారు.