Vikram: దానికోసం ఆకలి, నిద్ర మర్చిపోయా.. కొంత మంది నాకు అవార్డు వస్తుందని అంటున్నారు: విక్రమ్

వైవిధ్యమైన కథలతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే కథానాయకుల్లో విక్రమ్‌ ముందు వరుసలో ఉంటారు.

Update: 2024-08-14 14:11 GMT

దిశ, సినిమా: వైవిధ్యమైన కథలతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే కథానాయకుల్లో విక్రమ్‌ ముందు వరుసలో ఉంటారు. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విక్రమ్‌ తాజాగా తంగలాన్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పా రంజిత్‌ దర్శకత్వంలో కే ఈ జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'తంగలాన్‌' చిత్రం విశేషాలను మీడియాతో పంచుకున్నారు విక్రమ్‌.

నా గత చిత్రాలు శివపుత్రుడు, అపరిచితుడు. ఐ చిత్రాల తరహాలోనే తంగలాన్‌ కూడా ఒక డిఫరెంట్‌ మూవీ. ఇదొక ఎమోషనల్‌ కంటెంట్‌ ఉన్న చిత్రం. ఈ సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. పూర్తి రా కంటెంట్‌తో తెరెకెక్కిన చిత్రమిది. ఈ కథ చేసే సమయంలో దర్శకుడు ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాడు. రెగ్యులర్‌ సినిమా తరహాలో కాకుండా ఈ సినిమాలో ప్రతిది విభిన్నంగా ప్లాన్‌ చేశాడు దర్శకుడు. ఈ సినిమా నా జీవితంలో బ్యూటిఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. కొన్ని సన్నివేశాల్లో సహజత్వం కోసం లైవ్‌సౌండింగ్‌ వాడాం. నా కెరీర్‌లో ఇప్పటిదాకా లైవ్‌ సౌండింగ్‌ సినిమా చేయలేదు. ఈ మూవీ కోసం టీమ్ అందరూ ఎంతో కష్టపడ్డారు. ఇప్పటి వరకు పారంజిత్‌ చేసిన గొప్ప చిత్రాల సరసన తంగలాన్‌ కూడా నిలబడుతుంది. ప్రేక్షకుల్ని తంగలాన్ తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

నా పాత్ర కోసం పరిశోధన చేశాను..

ఈ సినిమాలో నా పాత్ర సహజంగా కనిపించేందుకు శారీరకంగా చాలా శ్రద్ధ తీసుకున్నాను. ఆహారం దొరకని పరిస్థితిలో ఉన్న క్యారెక్టర్ లో కనిపించాలంటే నేను హీరో బాడీలా సిక్స్‌ ప్యాక్‌లో ఉండకూడదు. కాబట్టి ఎటువంటి వాతావరణంలోనైనా అలాగే చిత్రీకరణ చేశాం. మనకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఆకలి, నిద్ర మర్చిపోతుంటాం. అలా నేను సినిమాల్లో నటిస్తున్నప్పుడు మిగతా విషయాలేవీ పట్టించుకోను. తంగలాన్ సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ చూస్తారా? అని ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాలో అడ్వెంచర్, మెసేజ్, మ్యాజిక్, ఎమోషన్స్ ఉన్నాయి. ఇది నాకు దొరికిన ది బెస్ట్ రోల్ అని అనుకుంటున్నా.

యూనివర్శల్‌ స్టోరీ ఇది

తంగలాన్ ఓ యూనివర్శల్‌ స్టోరీ ఈ కథతో తెలుగు, తమిళ, కన్నడ అని కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే స్టోరీ. బంగారం వేట నేపథ్యంలో ఈ కథ ఉన్నా అంతర్లీనంగా స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ కథను ఒక వర్గానికి ఆపాదించలేం. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకసారి అసమానతలకు గురవుతూ ఉంటాం. అలాంటి వారందరూ ఈ సినిమాతో కనెక్ట్‌ అవుతారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతారను తమిళ ఆడియన్స్ బాగా ఆదరించారు. కొంత మంది నాకు ఈ చిత్రంతో అవార్డు వస్తుందని అంటున్నారు నాకు అవార్డులు ఇష్టమే. కానీ ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలు మరింత ఆనందాన్ని కలిగిస్తాయి. ఇవాళ సినిమాకు భాషాంతరాలు లేవు. మంచి మూవీ ఎక్కడా చేసినా అందరికి రీచ్‌ అవుతోంది.

Tags:    

Similar News