ఇంటర్ మార్కుల ఎఫెక్ట్: ఇళ్లు అద్దెకు ఇచ్చేందుకు నిరాకరణ
ఈ మధ్య కాలంలో ఇళ్లు అద్దెకు తీసుకోవడం పెద్ద సమస్యగా మారింది
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో ఇళ్లు అద్దెకు తీసుకోవడం పెద్ద సమస్యగా మారింది. కులాన్ని బట్టి ఇళ్లు అద్దెకు ఇస్తుంటే.. మరికొన్ని చోట్ల మతాన్ని ఆధారంగా చేసుకొని అద్దెకు ఇస్తున్నారు. ఇలాంటి ఘటన మనం సోషల్ మీడియాలో అనేకం చూస్తూనే ఉంటాం. అయితే, తాజాగా.. ఇళ్లు అద్దెకు తీసుకోవడానికి తిరుగుతున్న ఓ వ్యక్తికి అనూహ్య పరిణామం ఎదురైంది. ఇంటర్మీడియట్‌లో 76 శాతం మార్కులు వచ్చినా ఇళ్లు ఇచ్చేందుకు నిరాకరించారు.
ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యోగేష్ అనే యువకుడు బెంగళూరులో ఇంటిని అద్దెకు తీసుకోవాలని భావించాడు. సొంతంగా ప్రయత్నించినా ఇళ్లు దొరక్కపోవడంతో ఓ హౌస్ బ్రోకర్‌ను కలిశాడు. ఆయన ఇంటి ఓనర్‌ను సంప్రదించాడు. ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు తనకు అభ్యంతరం లేదని, కానీ అద్దెకు ఉండే వ్యక్తి లింక్డ్ ఇన్ ప్రొఫైల్, ట్విట్టర్ ప్రొఫైల్ ఇవ్వాలని ఓనర్ కోరారు.
దీంతో పాటు టెన్త్ క్లాస్, ఇంటర్ మార్కుల మెమో, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవ్వాలని సూచించాడు. ఇంటర్‌లో 76 శాతం మార్కులు వచ్చాయని ఆ ఇంటి ఓనర్ ఇళ్లు అద్దెకు ఇవ్వడం కుదరదని చెప్పాడు. ఇదంతా హౌస్ బ్రోకర్, యోగేష్‌కు మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌లో స్పష్టమవుతోంది. ఈ చాట్‌ను అతడి కజిన్ శుభ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇకనుంచి ఇళ్లు అద్దెకు తీసుకోవాలంటే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పెడతారేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
"Marks don't decide your future, but it definitely decides whether you get a flat in banglore or not" pic.twitter.com/L0a9Sjms6d
— Shubh (@kadaipaneeeer) April 27, 2023