సెలబ్రిటీ డివోర్స్.. సెన్సేషన్ ఎందుకు?

స్త్రీ తన భర్త నుంచి విడాకులు కోరుకోవడం తప్పా? నరకంగా మారిన వివాహ బంధం నుంచి విముక్తి పొందడం పాపమా? భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం నైతికత లోపమా? ఈ విషయంలో మహిళనే తప్పు చేసిందని.. Latest Telugu News

Update: 2022-10-29 04:08 GMT

దిశ, ఫీచర్స్: స్త్రీ తన భర్త నుంచి విడాకులు కోరుకోవడం తప్పా? నరకంగా మారిన వివాహ బంధం నుంచి విముక్తి పొందడం పాపమా? భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం నైతికత లోపమా? ఈ విషయంలో మహిళనే తప్పు చేసిందని సమాజం విమర్శలు గుప్పించడం ఎంత వరకు కరెక్ట్? ఆమె జీవితంలో అడుగడుగునా అడ్డుపడటం సమంజసమేనా? స్టార్ హీరోయిన్ డివోర్స్ తీసుకుంటే ఆమె క్యారెక్టర్‌లెస్ అని కామెంట్స్ ఎలా పాస్ చేస్తారు? తన పర్సనల్ లైఫ్ గురించి తెలియకుండానే పబ్లిసిటీ స్టంట్ అని ఎలా డిసైడ్ చేస్తారు? పెళ్లి అనేది వ్యక్తిగత విషయం కాదా? ఎందుకంత సెన్సేషన్ చేయాలి? పబ్లిక్ మ్యాటర్‌గా ఎందుకు పరిగణించాలి?

మహిళా సెలబ్రిటీ విడాకులు తీసుకుంటే అందుకు తనే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆమె తీసుకున్న నిర్ణయం సమాజానికి చెడుగా కనిపిస్తుంది. స్టార్స్, 'పబ్లిక్ ఐకాన్స్' వంటి వారి వ్యక్తిగత విషయాలను పబ్లిక్‌గా చూడటం సరికాదు. వారు తమ జీవితంలో ఏమి అనుభవించారో మనకు తెలియనప్పుడు.. తీసుకున్న నిర్ణయాలపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, నెగెటివ్‌గా కామెంట్ చేయడం సరైనది కాదు. సంతోషంగా లేని బంధాన్ని బయటపెట్టినందుకు విమర్శించడం మూర్ఖత్వమే అవుతుంది.

తప్పు 'ఆమె'దేనా?

స్టార్ హీరోయిన్ సమంత విడాకుల విషయంలో దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంది. అక్కినేని వారసుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె.. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన నుంచి దూరం కావాలనుకుంది. దీంతో టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా ప్రశంసలు అందుకున్న జంట విడిపోవడాన్ని జీర్ణించుకోలేని అక్కినేని అభిమానులు, సాధారణ జనాలు.. తప్పంతా సమంతదేనని తిట్టిపోశారు. మీడియా, సోషల్ మీడియా కూడా వదలకుండా విపరీతమైన ట్రోలింగ్ చేశారు. 'అక్కినేని లాంటి గొప్ప వంశానికి కోడలైన సామ్ అణిగిమణిగి ఎందుకు ఉండకూడదు? అంత గొప్ప ఇంటికి కోడలు కావడమే అదృష్టం. ఈమెకు విడాకులు కావాల్సి వచ్చాయా?' అనే కామెంట్స్ ఎదురయ్యాయి. చైతు నుంచి రూ.500కోట్ల భరణం తీసుకుందనే వార్తలు వైరల్ అయ్యాయి. బోల్డ్ క్యారెక్టర్స్ ఎంచుకుంటున్న సామ్‌కు చై నో చెప్పాడు.. ఆ టైమ్‌లోనే కొత్త బాయ్‌ఫ్రెండ్ దొరికి ఉంటాడు అనే ఊహాగానాలు వినిపించాయి. కానీ సమంతకు ఏం సమస్య వచ్చింది? అనే పాజిటివ్ నోట్ సొసైటీ నుంచి రాలేదు. పైగా కొందరు నెటిజన్స్ దిగజారి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

రీసెంట్‌గా ధనుష్-ఐశ్వర్య దంపతుల విడాకుల మ్యాటర్ కూడా వైరల్ అయింది. వీరిద్దరు విడాకులు ప్రకటించగానే.. ఐశ్వర్యకు అంతకు ముందు మరో హీరోతో ఉన్న సంబంధాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. మళ్లీ ఆ లవ్ ఎఫైర్ గుర్తొచ్చిందేమో అని సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. ఇద్దరు పిల్లలున్న తల్లికి ఇదేం పోయే కాలమని బూతులు తిట్టారు. ఒక స్త్రీ స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటుందంటే.. భర్త నుంచి విడిపోవాలని అనుకుంటుందంటే.. తప్పు తనదే అంటున్నారు తప్పితే తన వైపు ఆలోచించే ఆలోచన కూడా చేయట్లేదు.

పతిత.. పాపం..

ప్రైవసీ లేకపోవడం ప్రతి సెలబ్రిటీ ఎదుర్కొనే ఒక సవాలు అయితే విడాకుల చుట్టూ ఉన్న నిషిద్ధం మరొకటి. మన సమాజంలో విడాకులు చెడిపోయిన సంబంధాన్ని అంతం చేయడానికి ఎప్పుడూ మార్గంగా చూడబడవు. విడాకుల చుట్టూ ఉన్న నిషేధం సామాన్యులకు లేదా సెలబ్రిటీలకు అందరికీ వర్తిస్తుంది. మన పితృస్వామ్య సమాజం ఏదైనా వ్యక్తి లేదా దంపతులు విడాకులు తీసుకోవడాన్ని నైతికంగా నిర్ణయించడం కష్టతరం చేస్తుంది. ఒక వ్యక్తి దేవుని నిర్ణయాన్ని ధిక్కరించి, వివాహ పవిత్రతను అణగదొక్కాలని కోరుకుంటే అపవిత్రంగా, బలహీనతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా స్త్రీ అన్యాయాన్ని భరించి, ఆనందాన్ని త్యాగం చేసి, కష్టాలు పడైనా సరే వివాహ బంధాన్ని నిలుపుకోవాలని పాఠం చెప్తున్న సమాజం.. అలా చేయలేదంటే పాపం చేసిన పతితగా ముద్రవేస్తు్ంది.

స్వార్థమా? నరకమా?

నిజానికి ఈ సమాజం వివాహంలో సమస్యలను చిన్న చిన్న అసౌకర్యాలుగా చూస్తుంది. అవి మ్యారేజ్ రిలేషన్‌లో భాగంగా ఉంటాయి. వైవాహిక జీవితంలోని ప్రతి సమస్య కూడా వివాహ బంధంలో భాగంగా కొట్టివేయబడుతుంది. భాగస్వామి విడాకులు తీసుకోవాలనే నిర్ణయాన్ని స్వార్థపూరిత దస్తావేజుగా ముద్రిస్తుంది. కుటుంబం ఆనందాన్ని పట్టించుకోకుండా.. తన ఆనందానికి ప్రాధాన్యత ఇచ్చిందని చిత్రీకరిస్తుంది. కానీ పెళ్లి అనేది వ్యక్తిగత నిర్ణయమని, దానిని ముగించాలని అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. చాలా మందికి వివాహం విషయంలో మొదట్లో తప్పుడు ఎంపికలు ఉండొచ్చు.. అలాంటప్పుడు వివాహాలు విఫలమవుతాయని సాధారణీకరించాలి. రాంగ్ చాయిస్ ఎంచుకోవడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అలాంటి ఎంపికలను మార్చుకోవాలి. అలాంటి వారిని సొసైటీ అభినందించాలి.

హక్కు ఎవరిదీ?

సెలబ్రిటీల విడాకుల గురించి సంచలనం చేసి, వారి ప్రైవేట్ విషయంలో జోక్యం చేసుకోవడం మానేయాలి. వారు పబ్లిక్ ఫిగర్స్ అయినందున, వారి వ్యక్తిగత జీవితం, నిర్ణయాలు ప్రజలు కోరుకున్న విధంగా ఉండాలని ఆలోచించడం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్. వారు ప్రజల కోసం చేసిన పనిపై తీర్పులు ఇవ్వవచ్చు కానీ, వ్యక్తిగత జీవితం గురించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వ్యాఖ్యానించే హక్కు జనానికి లేదు. దాన్ని సంచలనం చేయాల్సిన అవసరం అంతకుమించి లేదు. సామాన్యులు లేదా ప్రముఖులు.. ప్రైవసీ రైట్ ప్రతి ఒక్కరికీ చెందుతుంది. సెలబ్రిటీల పని లేదా బహిరంగ ప్రదర్శనను నిర్ధారించడానికి వారి వ్యక్తిగత జీవితంలోని నిర్ణయాలను పరిశీలనలోకి తీసుకోకూడదు. అది పబ్లిసిటీ స్టంట్ కాదు. పబ్లిక్ ఫిగర్స్, ముఖ్యంగా మహిళలు, పబ్లిక్ స్క్రూటినీ భయం కారణంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడాన్ని కఠినం చేయొద్దు. దీని పర్యవసానాలు మనం ఊహించలేనంత దారుణంగా ఉంటాయి.

Read more:

1.Vijay Devarakonda, Rashmika Mandanna Marriage. Janhvi Kapoor షాకింగ్ కామెంట్స్


Similar News