కంగనాకు షాక్ ఇచ్చిన బాంబే హైకోర్ట్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మరోసారి నిరాశే ఎదురైంది.
దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటి, లోక్ సభ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranouth) కు మరోసారి నిరాశే ఎదురైంది. కంగనా స్వయంగా దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించిన "ఎమర్జెన్సీ"(Emergency) సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. కాగా సెన్సార్ ఈ బోర్డ్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కంగనా బాంబే హైకోర్టుకు వెళ్ళింది. తన సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేలాగా ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్లో కంగనా పేర్కొంది. అయితే ఈ విషయంలో కంగనాకు తీవ్ర నిరాశ ఎదురైంది. సర్టిఫికెట్ ఇవ్వాలని తాము బోర్డును ఆదేశించలేమని కోర్ట్ తేల్చి చెప్పింది. బోర్డ్ ఏ కారణం వలన సర్టిఫికెట్ ఇవ్వడాన్ని ఆపిందో తెలియకుండా సర్టిఫికెట్ ఇవ్వండి అని తాము చెప్పలేమన్నది. అయితే ఈనెల 18 లోగా ఏదోక నిర్ణయం తీసుకోవాలని మాత్రం సెన్సార్ బోర్డుకు హైకోర్ట్ సూచించింది.
కంగనా రనౌత్ దర్శకత్వం వహించి, తానే స్వయంగా ప్రధాన పాత్ర పోషించిన ఎమర్జెన్సీ సినిమా ముందు నుండి వివాదాలను ఎదుర్కొంటుంది. ఈనెల 6న ఈ సినిమా విడుదల అవాల్సి ఉండగా.. సెన్సార్ బోర్డ్ నుండి ఎలాంటి సర్టిఫికెట్ రాక, సినిమా విడుదల ఆగిపోయింది. ఈ సినిమాలో చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయని, అవి దేశంలో అస్థిరతను సృష్టించే అవకాశం ఉన్నందున, సర్టిఫికెట్ ఇవ్వలేమని సెన్సార్ బోర్డు వివరించింది. దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ హత్య వంటి అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది.