Chalapathi Rao:సీనియర్ నటుడు చలపతిరావు ప్రస్థానం ఇదే

టాలీవుడ్ సీనియర్ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు(78) ఇక లేరు..

Update: 2022-12-25 07:44 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు(78) ఇక లేరు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అయితే రెండు రోజుల క్రితమే ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతిచెందగా ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో తెలుగు చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

1944 మే 8న కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో జన్మించిన చలపతిరావు.. విలనిజం, పౌరాణిక తదితర పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. ఇక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆయన నటనపై ఉన్న ఆసక్తితో చదువుకుంటున్న రోజుల్లోనే ఎన్నో నాటకాల్లో పాల్గొంటూ అలరించేవాడు. ఈ క్రమంలోనే దివంగత నటుడు ఎన్‌టీఆర్‌ చొరవతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా 'కథానాయకుడు'తో చలపతి నట ప్రస్థానం మొదలైంది. మొత్తం 1500కు పైగా చిత్రాల్లో నాలుగు తరాల నటీనటులతో కలిపి పనిచేయగా.. 'దానవీర శూర కర్ణ' సినిమాలో ఏకంగా ఐదు పాత్రలు పోషించి ఔరా అనిపించాడు. అలాగే 'యమగోల', 'యుగపురుషుడు', 'డ్రైవర్‌ రాముడు', 'అక్బర్‌ సలీమ్‌ అనార్కలి', 'భలే కృష్ణుడు', 'సరదా రాముడు', 'జస్టిస్‌ చౌదరి', 'బొబ్బిలి పులి', 'చట్టంతో పోరాటం', 'దొంగ రాముడు', 'అల్లరి అల్లుడు', 'అల్లరి', 'నిన్నే పెళ్లాడతా', 'నువ్వే కావాలి', 'సింహాద్రి', 'బన్నీ', 'బొమ్మరిల్లు', 'అరుంధతి', 'సింహా', 'దమ్ము', 'లెజెండ్‌' ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఆయనకు గుర్తింపునివ్వగా గతేడాది విడుదలైన 'బంగార్రాజు' తర్వాత చలపతిరావు వెండితెరపై కనిపించలేదు.

ఇక నటుడుగానే కాకుండా 'కలియుగ కృష్ణుడు','కడప రెడ్డమ్మ','జగన్నాటకం','పెళ్లంటే నూరేళ్ల పంట'తదితర సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన చలపతిరావుకు గొప్ప లవ్ స్టోరీ ఉంది. బందరులో 'పీయూసీ' చదువుతున్న సమయంలో 19 ఏళ్లకే ఇందుమతిని పెళ్లి చేసుకుని బెజవాడలో కాపురం పెట్టాడు. అయితే ఆయన వేసిన 'తస్మాత్ జాగ్రత్త' అనే నాటకంలో హీరోయిన్ ఎవరూ ముందుకు రాకపోవడంతో తన భార్యనే కథనాయికగా తీసుకోగా ఆ నాటకానికిగానూ ఆమె ఉత్తమనటి అవార్డు దక్కించుకుంది. అలాగే ఇవీవీ సత్యనారాయణతో మంచి అనుబంధం కొనసాగించగా.. చలపతిరావు జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రెండుమూడు సినిమాలు తెరకెక్కించాడు ఇవీవీ. 'మా నాన్నకు పెళ్లి' పూర్తిగా తన జీవిత కథే కావడం విశేషం. ఇక ఆయన 28వ ఏటనే భార్య ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో చనిపోగా అప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. ఎన్‌టీ‌ఆర్‌తో పాటు ఎంతోమంది మళ్లీ పెళ్లిచేసుకోమని చెప్పిన ఆయన ఒప్పుకోకపోవడం ఆయన గొప్పతనానికి ప్రతీకగా నిలవగా.. ఆయన కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా రానిస్తున్నాడు.

చలపతిరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు. ఆయన కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాతే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానం ఫ్రీజర్‌లో ఉంచి బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి : తండ్రి చలపతిరావు‌తో రవిబాబు స్పెషల్ వీడియో..

Tags:    

Similar News