ఆర్ఆర్ఆర్ కు మరో అంతర్జాతీయ అవార్డ్.. చంద్రబోస్ ఫుల్ ఖుష్
గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ తో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను తన సొంతం చేసుకున్న నాటు నాటు సాంగ్ తాజాగా మరో ఘనతను సాధించింది.
దిశ, వెబ్ డెస్క్: గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ తో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను తన సొంతం చేసుకున్న నాటు నాటు సాంగ్ తాజాగా మరో ఘనతను సాధించింది. ఒక అచ్చ తెలుగు నాటునాటు పాట ప్రపంచాన్ని, హాలీవుడ్ ఒక ఊపు ఊపేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సినిమా అవార్డు అయిన ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ లో బెస్ట్ ఒరిజినల్ విభాగంలో నిలిచింది. ఇక మరికొద్ది గంటల్లో ఆస్కార్ వేడుకలు జరుగుతుండటంతో భారతీయులంతా ఈ వేడుక కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
ఆస్కార్ కు ముందు నాటు నాటు సాంగ్ కి మరో ప్రశంస దక్కింది.అమెరికాలోని సొసైటీ ఆఫ్ కంపోజర్స్, లిరిసిస్ట్ సంస్థ ఈ పాటకు .. ఈ పాట రాసిన చంద్రబోస్ కు ప్రత్యేకమైన ప్రశంసను అందజేసింది. శనివారం రాత్రి సొసైటీ ఆఫ్ కంపోజర్స్, లిరిసిస్ట్ సంస్థ కార్యక్రమం జరగగా ఈవెంట్ లో నాటు నాటు సాంగ్ కు గాను పాట రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణిలను అభినందిస్తూ ప్రశంస పత్రాన్ని అందించారు. వేదికపైకి వెళ్లి చంద్రబోస్ ఈ సత్కారాన్ని స్వీకరించారు. ఇక చంద్రబోస్ అదే స్టేజ్ పై ఉన్న ప్రపంచ ప్రఖ్యాత గేయ రచయితలతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మరికొద్ది గంటల్లో నాటు నాటు పాట ఆస్కార్ అందుకునే అవకాశం కూడా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాటకి కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా చంద్రబోస్ పాటని రాశారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డ్యాన్స్ సమకూర్చారు. పాటను రాసి పూర్తిగా తెరకెక్కించేందుకు గాను దాదాపుగా 19 నెలలు పట్టిందని గతంలోనే మూవీ టీం వెల్లడించింది.