సెవెన్‌ వింటర్స్‌ ఇన్‌ టెహ్రాన్‌ (2023)

7వ ఫ్రేమ్స్‌ ఆఫ్‌ ఫ్రీడం ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సినిమా సమీక్షలు

Update: 2024-09-27 15:46 GMT

7వ ఫ్రేమ్స్‌ ఆఫ్‌ ఫ్రీడం ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సినిమా సమీక్షలు

ఆగష్టు 15. మనకు స్వాతంత్య్ర దినోత్సవం. కానీ స్వాతంత్య్రమంటే ఏమిటి? అది మనకు సంపూర్ణంగా దొరికిందా? ఏ లోపాలు మన స్వాతంత్య్రానికి అర్థం లేకుండా చేస్తున్నాయ్‌? - సంబరాల వెనుక మరుగున పడిపోయే ప్రశ్నలివి. వీటిని లేవనెత్తడానికే కోల్‌కతా పీపుల్స్‌ ఫిల్మ్‌ కలెక్టివ్‌ వారు ప్రతి ఏడాదీ ఆగష్టు 15న ‘ఫ్రేమ్స్‌ ఆఫ్‌ ఫ్రీడం’ పేరుతో ఓ చలనచిత్రోత్సవం నిర్వహిస్తుంటారు. ఇరాన్‌, పాలస్తీనా దేశాలపై ఈ ఏడాది ఫోకస్‌ చేశారు. 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్‌ రివల్యూషన్‌ జరిగింది. ‘షా పోయి ఖొమేనీ వచ్చె డుం డుం డుం డుం’లాంటి పరిస్థితి తయారైంది. రివల్యూషన్‌ సమయంలో భుజం భుజం కలిపి పోరాడిన కమ్యూనిస్టులనే అణగదొక్కింది కొత్త ప్రభుత్వం. స్త్రీలపై మత నియమాల్ని కఠినంగా అమలు చేయనారంభించింది. ఇక పాలస్తీనా విషయానికొస్తే 1948 నుండీ అక్కడి ప్రజలు తమ దురాక్రమిత గడ్డ కోసం పోరు సాగించని రోజు లేదు. ప్రస్తుతం గాజాపై ఏడాదికి పైగా దాడి జరుగుతోంది. గర్భిణీ స్త్రీలనూ, చిన్నపిల్లలనూ చంపడంలో ఇజ్రాయెల్‌కు ప్రత్యేక ప్రావీణ్యత ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఫెస్టివల్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో ఇరుదేశాలకు సంబంధించిన రెండు ముఖ్యమైన డాక్యుమెంటరీలు ఉన్నాయి.

1. సెవెన్‌ వింటర్స్‌ ఇన్‌ టెహ్రాన్‌ (2023) (దర్శకురాలు: స్టెఫీ నిదర్జోల్‌)

ఉదయం పది గంటలకు వేసిన మొదటి సినిమా ఇది. అంతకు ముందు రోజు రాత్రి కోల్‌కతా నగరం నిద్రపోలేదు. ఆర్జీ కర్‌ మెడికో విద్యార్థి హత్యాచారంపై తక్షణ న్యాయం కోరే ర్యాలీలతో నగరం అట్టుడికిపోయింది. ‘రాత్రులను స్త్రీలు తమ గుప్పెట్లోకి తీసుకోవాలం’టూ స్త్రీలు నగర వీధుల్ని దిగ్బంధనం చేశారు. పురుషులూ, వృద్ధులు కూడా వారికి తోడుగా వెళ్లారు. చాలా మంది నిద్రకళ్లతోనే ఈ ఉత్సవానికి హాజరయ్యారు. అలా హాజరైన వారి నిద్ర వదిలించి కదిపి, కుదిపి, ఏడ్పించిన సినిమా ‘సెవెన్‌ వింటర్స్‌ ఇన్‌ తెహ్రాన్‌’.

ఇరాన్‌ రాజధాని తెహ్రాన్‌ నగరం. 2007 జూలై నెల. రెహానే జబ్బారీ అనే అమ్మాయి. వయసు 19. ఆమె తన కథను నేపథ్యంలో వినిపిస్తోంది.

‘‘2007 వసంత కాలంలో ఓ రోజున, నేనో ఐస్‌ క్రీం దుకాణంలో ఉన్నాను. ఒక క్లయింట్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నాను. గతంలో నేనతని కోసం ఓ అంతర్జాతీయ ఫెయిర్‌లో ఓ బూత్‌ని డిజైన్‌ చేశాను. నా కాల్‌ అయిపోగానే, స్నేహితుడితో కలిసి కూర్చున్న ఒక మధ్య వయస్కుడు నా దగ్గరకు వచ్చాడు. ‘నేను మీ సంభాషణను విన్నాను. మీరు ఇంటీరియర్‌ డిజైనర్‌ అని గమనించాను. నేనో స్థలాన్ని క్లినిక్‌గా మార్చాలనుకుంటున్నాను. నేను ప్లాస్టిక్‌ సర్జన్‌ని.’ అని అతడన్నాడు.’’

ఆమె మోర్తేజా అబ్దోలాలి సర్బందీ అనే ఆ 47 ఏళ్ల వ్యక్తితో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లింది. అక్కడాయన ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఎంత బ్రతిమాలినా వినకుండా మీదికి లంకించబోయాడు. ఆత్మరక్షణ కోసం ఓ పాకెట్‌ కత్తితో ఆ వ్యక్తిని పొడిచి అక్కడ్నుంచి పారిపోయిందామె. బాగా రక్తస్రావమై ఆయన చనిపోయాడు. ఆ రోజు రాత్రి పోలీసులు ఆమెను వారింటి నుండి అరెస్టు చేశారు. చనిపోయిన వ్యక్తి ఇరాన్‌లోని ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి. అతనికి ప్రభుత్వంలో బలమైన కనెక్షన్లున్నాయి. ఇంకేం? ఒక ఆత్మ రక్షణ ప్రయత్నాన్ని, సునియోజిత హత్యా ప్రయత్నంగా కేసును అల్లారు. నెలల తరబడి ఆమెను ఏకాంత నిర్బంధంలో ఉంచారు. హత్యచేయాలన్న దురుద్దేశంతోనే ఆమె రెండు రోజుల ముందు చురకత్తిని కొన్నట్టు ఆమె చేత బలవంతంగా వాంగ్మూలాలు రాయించుకున్నారు. లేదంటే ఆమె సోదరికి ప్రాణహాని ఉందని భయపెట్టారు. ఆమెకు న్యాయం అందించగల ఆధారాలను ధ్వంసం చేశారు. ఒక న్యాయమూర్తి ఆమె పట్ల సానుభూతితో వ్యవహరించడం వలన విచారణ న్యాయం వైపు నాలుగడుగులు ముందుకు వేసింది. కానీ ఆయనను తొలగించి, ఆయన స్థానంలో మరొకరిని త్వరత్వరగా నియమించి కేసులో సాధించిన ప్రగతిని వెనక్కి తోడేశారు.

రెహానే కుటుంబ సభ్యులూ, స్నేహితులూ, మద్దతుదారులూ ఆమెను మరణ శిక్ష నుండి తప్పించడానికి చేపట్టే ప్రయత్నాలను చూపుతుంది ఈ సినిమా. ఇరాన్‌లోని రాజకీయ వాతావరణం రీత్యా నిందుతురాలికి మద్దతుగా నిలబడడం కూడా చాలా రిస్కుతో కూడుకున్న పని. అయినా సరే చాలా మంది ముందుకొచ్చారు. రెహానే విడుదలకై సాగిన ఈ పోరాటం ఇరాన్‌లో మహిళలపై సాగుతున్న సామూహిక అణచివేతకు వ్యతిరేకంగా సాగిన పోరాటంగా రూపుదాల్చింది.

2009లో తెహ్రాన్‌ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. అసలు సర్బందీ రెహానే చురకత్తి పోటు వల్ల చనిపోలేదనీ, అదే ఇంట్లో ఇంకెవరో ఆయనను చంపారనీ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆరోపించింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో పాటు, ఐక్యరాజ్య సమితి, యూరోపియన్‌ యూనియన్‌ ఆమె మరణ శిక్షను రద్దు చేయించాలని ప్రయత్నించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ 20,000 మంది సంతకాలను సేకరించాయి. రెహానే కుటుంబ సభ్యులు సాగించిన సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌కు కూడా చాలా మద్దతు దొరికింది.

29 సెప్టెంబరు 2014న, ఆమె మరణశిక్ష ఖాయం అన్న వార్త వచ్చింది. కానీ కొద్ది రోజుల వరకు శిక్ష అమలును నిలిపివేస్తున్నట్టు 1 అక్టోబర్‌ 2014న మరో వార్త వచ్చింది. రెహానే తల్లి తన గుండెను గుప్పెట్లో పెట్టుకుని రోజులు గడుపుతోంది. ఎందుకంటే కుమార్తె శిక్షను తప్పించడానికి ఆమె ఎంత పరితపిస్తోందో ఆమెకు మాత్రమే తెలుసు.

చివరికి 2014 అక్టోబరు 25న చడీచప్పుడు లేకుండా మరణశిక్షను అమలు చేశారు. తన అవయవాలను దానం చేయమని కోరుతూ రెహానే తన తల్లికి తన ఆఖరు రికార్డు చేసిన సందేశం పంపింది.

రెహానే చనిపోయిన పదేళ్ల తర్వాత ఆమె కథను డాక్యుమెంటరీ ద్వారా ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది జర్మన్‌ దర్శకురాలు స్టెఫీ నెదర్జోల్‌. నిందితురాలికి మద్దతు పలకడమే కష్టమైన పరిస్థితుల్లో ఇటువంటి సినిమాను నిర్మించడం ఎంత సాహసచర్యో ఆలోచించాలి. కుటుంబ సభ్యులు రహస్యంగా రికార్డ్‌ చేసిన వీడియోలూ, వారి సాక్ష్యాలూ, రెహానే జైలు నుండి రాసిన భావోద్వేగంతో కూడిన కవితాత్మక ఉత్తరాల ఆధారంగా దర్శకురాలు ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. రెహానే 2007 నుండి 2014 వరకు ఏడేళ్ల కాలంలో రెండు మూడు కారావాసాలకు మారింది. అక్కడామె అబద్ధపు కేసుల్లో మ్రగ్గుతున్న వేశ్యలనూ, అత్యాచార బాధితుల్నీ కలిసింది. వారిలో ధైర్యం నూరిపోసింది. మహిళలుగా సమాజంలో ఏం సాధించవచ్చో నేర్పింది. వారిలో కొందరు జైలు నుంచి విడుదలయ్యారు. వారంతా ఇంటర్వ్యూల్లో రెహానే గురించి తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మూడంచెల మంచాలతో జైలు లోపలి గదుల మినియేచర్‌ను చూపుతూ, రెహానే ఉత్తరాల్ని ‘హోలీ స్పైడర్‌’ నటి జార్‌ అమీర్‌ ఇబ్రహీమి నేపథ్యంలో భావోద్వేగంతో చదువుతూ వుంటే రెహానే వ్యక్తిత్వం క్రమంగా మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. దాదాపు మతఛాందస సమాజాలన్నింట్లో స్వేచ్ఛగా వుండే ఆడపిల్లలను గురించి తక్కువచేసి చెప్పుకుంటారు. రెహానే తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు తగినంత స్వేచ్ఛనిచ్చి పెంచారు. కట్టుబాట్లు తప్పిన పిల్లలను ఏం చేసినా పర్వాలేదన్న వైఖరి మతతత్వం తలకెక్కించుకున్న వారిది. ఈ మనస్తత్వం న్యాయపోరాటానికి తప్పకుండా కొంత విఘాతం కలిగిస్తుంది.

ఇరాన్‌లో ‘బ్లడ్‌ రివెంజ్‌’ (నెత్తుటితో పగసాధింపు) అనే పద్ధతి వుంది. దీని ప్రకారం బాధితుడి కుటుంబం వారు నిందితురాలికి క్షమాబిక్ష పెట్టవచ్చు లేదా అవసరమనుకుంటే నిందితురాలి కాళ్ల కింది కుర్చీని తన్ని, తామే శిక్షను అమలు చేయవచ్చు. సర్బందీ కొడుకు చేతిలో ఈ ఆప్షన్‌ వుంది. తన కుమార్తెను క్షమించి వదిలేయమనీ, అవసరమైతే తనను ఉరేయమనీ రెహానే తల్లి అతడ్ని ఎన్నో సార్లు ఫోన్లో వేడుకుంది. ‘మా నాన్న నిర్దోషి అనీ, అత్యాచార ప్రయత్నం చేయలేదనీ రాసి ఇచ్చేస్తే క్షమిస్తాను’ అన్నది అతడి షరతు. ‘ప్రాణం కోసం అబద్ధం ఆడను’ అన్నది రెహానే పట్టుదల. ‘మా నాన్న ధర్మనిష్టాపరుడు కనుక ఇలాంటి పాడుపని చేయబోడు’ - నిందితుడి కొడుకు వాదన. ‘ఇంకొకరి బూటకపు కుటుంబగౌరవం కంటే తన ఆత్మగౌరవమే ముఖ్యమం’టూ ఉరినే వరించింది రెహానే. అందుకే ఇరాన్‌ మహిళల పోరాటానికి ప్రతీక అయిపోయిందామె. ప్రస్తుతం రెహానే తల్లీ, సోదరీ జర్మనీలో ఉంటూ ఇరాన్‌ మహిళల కోసం పోరాడుతున్నారు. రెహానే తండ్రికి దేశం విడిచివెళ్లే అనుమతి ఇప్పటికీ లభించడం లేదు.

శీతాకాలం బాధకు ప్రతీక. ‘ఏడు శీతాకాలాల కారావాస బాధ రెహానేదే కాదు. స్వేచ్ఛ కోసం, న్యాయం కోసం పెనుగులాడుతున్న ప్రతి ఇరాన్‌ మహిళదీనూ!’ అన్నది శీర్షికకు అర్థం.

- ఎమ్ బాలాజీ (కోల్‌కతా)

మంచి సినిమా నిర్వాహకులు

90077 55403

..................


Similar News