వానరాల్లో పరిణామక్రమం?

దిశ, వెబ్‌డెస్క్: మారిన వాతావరణ పరిస్థితులకు, కొత్త అభివృద్ధి పరిణామాలకు తగినట్లుగా మానవుడు మనుగడను కొనసాగించగలడు. కాబట్టే ఈ భూమ్మీద ఉన్న ఇతర జీవరాశులతో పోల్చితే ఉన్నత జీవిగా కొనసాగగలుగుతున్నాడు. రాళ్లు కొట్టుకుని, నిప్పు పుట్టించి, పచ్చి మాంసాన్ని తినే పురాతన రోజుల నుంచి సూట్ వేసుకుని, పిజ్జాలు, బర్గర్లు తినే స్థాయికి ఎదగడంలో మానవుడు ఎన్నో పరిస్థితులను తట్టుకున్నాడు. కానీ, జంతువుల విషయంలో అలా కాదు. అవి వాటికి సహజంగా వచ్చిన లక్షణానికి ఏ మాత్రం […]

Update: 2020-09-25 01:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: మారిన వాతావరణ పరిస్థితులకు, కొత్త అభివృద్ధి పరిణామాలకు తగినట్లుగా మానవుడు మనుగడను కొనసాగించగలడు. కాబట్టే ఈ భూమ్మీద ఉన్న ఇతర జీవరాశులతో పోల్చితే ఉన్నత జీవిగా కొనసాగగలుగుతున్నాడు. రాళ్లు కొట్టుకుని, నిప్పు పుట్టించి, పచ్చి మాంసాన్ని తినే పురాతన రోజుల నుంచి సూట్ వేసుకుని, పిజ్జాలు, బర్గర్లు తినే స్థాయికి ఎదగడంలో మానవుడు ఎన్నో పరిస్థితులను తట్టుకున్నాడు. కానీ, జంతువుల విషయంలో అలా కాదు. అవి వాటికి సహజంగా వచ్చిన లక్షణానికి ఏ మాత్రం విరుద్ధంగా ఉన్న పరిస్థితిని అస్సలు తట్టుకోలేవు. అయితే, మనుషులకు దగ్గరి సంబంధం ఉన్న వానర జాతి ఇప్పుడిప్పుడే కొత్తగా పరిణామక్రమం చెందుతోందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా కోతులు, చింపాంజీలు కూడా తమ బుద్ధిని మార్చుకుంటున్నాయి.

ఉదాహరణగా కోతుల ప్రవర్తననే చూస్తే ఈ విషయం స్పష్టంగా విదితమవుతుంది. మానవ ఆవాసాలు అడవుల వరకు చేరడంతో కోతులన్నీ ఇళ్లల్లో ప్రవేశించి ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. భారతదేశం అంతటా ఈ కోతుల సమస్య ఉంది. ఈ కోతుల కారణంగా వ్యవసాయం చేయడానికే రైతులు భయపడుతున్నారంటే వాటి ఇబ్బంది గురించి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. జనాల్లో ఉండటం ఇప్పుడు కోతులకు అలవాటైందని శాస్త్రవేత్తల అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకప్పుడు కోతులు తమ పిల్లలకు అడవిలో చెట్ల కొమ్మల మీద ఎగురుతూ, పండ్లు ఎలా కోసుకుని తినాలో నేర్పించేవి. కానీ, ఇప్పుడు ఇళ్లలో నుండి ఆహారాన్ని ఎలా సంపాదించాలో నేర్పిస్తున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. ఈ దృగ్విషయాన్ని గమనించిన తర్వాత జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీకి చెందిన అమ్మీ కలాన్ బృందం ఈ దిశగా లోతైన అధ్యయనాన్ని కొనసాగించారు.

ఈ అధ్యయనంలో 114 చింపాంజీల మీద వీరు పరిశోధన చేశారు. వీటిలో కొన్ని చింపాంజీలు అటవీ ప్రాంతాల్లో బతికే అలవాటు ఉన్నవి. మరికొన్ని చింపాంజీలు పెద్దగా చెట్లు లేని జనావాస ప్రాంతాలకు దగ్గరగా బతికే అలవాటు ఉన్నవి. ఈ రెండింటి మధ్య ప్రవర్తనాశైలుల్లో చాలా తేడాలు గమనించినట్లు అమ్మీ కలాన్ బృందం తెలిపింది. ఒకే జాతికి చెందినవైనప్పటికీ కొన్ని చింపాంజీలు నీటిని చూసి భయపడితే, మరికొన్ని చింపాంజీలు మాత్రం అదే నీటిలో స్నానం చేసి ఆడుకోవడం, కొన్ని చింపాంజీలకు మనుషుల మాదిరిగా చేపలను ఎర వేసి పట్టడం తెలిస్తే, కొన్ని చింపాంజీలు మాత్రం అసలు చేపలు తినడానికే ఆసక్తి చూపలేదని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

ఈ రకంగా చూస్తే కేవలం మనుషుల మాత్రమే కాకుండా జీవులు కూడా పరిస్థితులకు తగినట్లుగా మారగలుగుతాయని చెప్పే జీవపరిణామ సిద్ధాంతం అక్షరాల నిజమని మరోసారి రుజువైందని అమ్మీ కలాన్ అన్నారు. అంతేగాకుండా ప్రస్తుతం అంతరించి పోతున్న దశలో ఉన్న జంతుజాతులకు కూడా ఇలా మనుగడ విధానాలను నేర్పించగలిగితే ఆయా జాతుల తర్వాతి తరాలు కొత్త లక్షణాలను పుణికిపుచ్చుకుని భూమ్మీద నివసించే అవకాశం ఉంటుంది. అంతరించే జాతులను రక్షించడానికి ఈ అధ్యయనం తోడ్పడిందని, ఇప్పుడు ఆ జాతులు వాటంతట అవే కొత్త లక్షణాలను నేర్చుకోగలిగే పరిస్థితులు కల్పించడం దిశగా తమ అధ్యయనాన్ని ఈ బృందం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News