ఇక ఏ వయస్సులోనైనా తల్లి కావచ్చట..

దిశ, వెబ్‌డెస్క్: హిందీ నటి, టెలివిజన్ ప్రజెంటేటర్ మోనా సింగ్ 2019లో శ్యాంగోపాలన్‌ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన భర్త చేయి పట్టుకుని ఈ ప్రపంచాన్ని మరో కోణంలో చూడాలని కోరుకుంటున్న మోనా.. తన ప్రేమ, సంతోషాలను అతనితో మాత్రమే పంచుకోవాలనుకుంటోంది. అందుకని ఇప్పుడే పిల్లలు వద్దని, పిల్లల్ని కనేందుకు తను సంసిద్ధంగా లేనని చెబుతోంది. ఆమె ప్రస్తుత వయసు 34. మరి ఈ వయసు దాటాక పిల్లల్ని కనేందుకు ఆస్కారం ఉందా? అంటే.. ‘ద అమెరికన్ […]

Update: 2020-11-25 01:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: హిందీ నటి, టెలివిజన్ ప్రజెంటేటర్ మోనా సింగ్ 2019లో శ్యాంగోపాలన్‌ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన భర్త చేయి పట్టుకుని ఈ ప్రపంచాన్ని మరో కోణంలో చూడాలని కోరుకుంటున్న మోనా.. తన ప్రేమ, సంతోషాలను అతనితో మాత్రమే పంచుకోవాలనుకుంటోంది. అందుకని ఇప్పుడే పిల్లలు వద్దని, పిల్లల్ని కనేందుకు తను సంసిద్ధంగా లేనని చెబుతోంది. ఆమె ప్రస్తుత వయసు 34. మరి ఈ వయసు దాటాక పిల్లల్ని కనేందుకు ఆస్కారం ఉందా? అంటే.. ‘ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఒబెస్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్’ ప్రకారం ఉమెన్ ఫెర్టిలిటీ డిక్లైన్ 30 ఏళ్ల వయసులో మొదలై 35 వచ్చేసరికి చాలా వరకు తగ్గిపోతుంది. ఈ లెక్కన మహిళలు మూడు పదులలోపే తమ కుటుంబాన్ని, కెరీర్‌ను, కోరికలను బ్యాలెన్స్ చేయాలా? అంటే అందుకు ‘ఫ్రీజింగ్ ఎగ్’ ఓ పరిష్కారాన్ని చూపింది..అదే ‘ఫ్రీజింగ్’. మోనాసింగ్ కూడా తన ఆరోగ్యకరమైన అండాలను భవిష్యత్తు కోసం ఫ్రీజ్ చేస్తోంది. కొవిడ్ పాండమిక్ తర్వాత ఈ ‘ఎగ్ ఫ్రీజింగ్’ అనేది మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంతకీ అసలు ‘ఎగ్ ఫ్రీజింగ్’ అంటే ఏమిటి?

పురుషులకు ఉన్నంత స్వేచ్ఛ, స్వాతంత్ర్యం మహిళలకు ఉండదన్నది తెలిసిందే. ఇక ‘పెళ్లి’ తర్వాత ఆమె ప్రపంచమే మారిపోతుంది. అప్పటివరకు ఇంట్లో ‘చిన్న పిల్ల’లా గారాబంగా పెరిగిన అమ్మాయి.. మూడుముళ్లు పడ్డాక ఒక్కసారిగా బరువు, బాధ్యతల్లోకి అడుగుపెడుతుంది. పెళ్లికి ముందు చదువులకే ప్రాధాన్యతనివ్వడంతో ‘అమ్మాయిల’కు జీవితాన్ని ఆస్వాదించే సమయం అంతగా ఉండదనే చెప్పాలి. అందుకే పెళ్లి తర్వాత భర్త ప్రేమను కోరుకుంటారు. తనతో కలిసి మధురమైన క్షణాలను గడపాలనుకుంటారు. తమ లైఫ్‌లో చేయాలనుకున్న పనులను, ఏర్పరచుకున్న లక్ష్యాలను భర్త సాయంతో చేరుకోవాలనుకుంటారు. కానీ, పెళ్లయ్యిందంటే చాలు.. కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్నేహితులు అందరూ అడిగే ఒకే ఒక్క ప్రశ్న ‘గుడ్ న్యూస్’ ఉందా? ఎక్కడికి వెళ్లినా, ఎవరు కనపడ్డా అదే ప్రశ్నను గుచ్చి గుచ్చి అడుగుతారు. ‘ఏదైనా లోపం ఉందా’? ‘డాక్టర్‌ను సంప్రదించారా?’ అంటూ తెగ విసిగిస్తారు. ఉమన్ ఫెర్టిలిటీ విషయానికి వచ్చేసరికి, అందులో మహిళల వయసు ప్రధాన భూమిక పోషిస్తుంది. అందుకే ఎందరో మహిళలు తమ కెరీర్‌ను, కోరికలను పక్కన పెట్టి ‘పిల్లలను కనడానికి’ ఇష్టపడతారు. ఇక మీదట వారికి వయసు అడ్డంకి కాదు. ఎందుకంటే ‘ఫ్రీజింగ్ ఎగ్’ పద్ధతి ద్వారా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే పిల్లల్ని కనే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంతోమంది మహిళలు పెళ్లికి ముందే తమ అండాలను భద్రపరుచుకుంటున్నారు. సాధారణంగా ‘యంగర్ ఎగ్స్’ చాలా ఆరోగ్యంగా ఉండటంతోపాటు పుట్టే బేబీ కూడా ఆరోగ్యంగా పుడుతుంది. అందుకే మహిళలు ఈ పద్ధతికి ఓటేస్తున్నారు. తమ లైఫ్ గోల్స్, పార్ట్‌నర్ లవ్ కోరుకుంటూనే, తమకు ఇష్టమైన సమయంలోనే మాతృత్వాన్ని పొందేందుకు ‘ఎగ్ ఫ్రీజింగ్’ ఉపయోగపడుతుంది.

ఫ్రీజ్ చేసిన ఎగ్స్‌తో ప్రపంచంలోనే తొలిసారిగా 1986లో ఒక మహిళకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. 2008 నుంచి ప్రాచుర్యంలోకి వచ్చిన ‘ఎగ్ ఫ్రీజింగ్’.. 2018లో పదిరెట్లు పెరిగింది. ఇక కరోనా పాండమిక్ తర్వాత ఎంతోమంది మహిళలు ‘ఎగ్ ఫ్రీజింగ్’ మెథడ్‌ను ఫాలో అవుతున్నారు. ఎగ్ ఫ్రీజింగ్‌లో మొదటగా మహిళల శరీరంలోకి హార్మోన్స్‌ను రెండు వారాలు ఇంజెక్ట్ చేస్తారు. దాంతో ఎక్కువ సంఖ్యలో అండాలు విడుదలవుతాయి. రెండు వారాల తర్వాత వాటిని ఎక్స్‌ట్రాక్ట్ చేసి వాటిని జీరో టెంపరేచర్ (-196 డిగ్రీ సెంటిగ్రేడ్) వద్ద ఫ్రీజ్ చేస్తారు. ఈ విధంగా అండాల బయోలాజికల్ యాక్టివిటీని పాజ్ చేస్తారు. సాధారణంగా 37 సంవత్సరాలు దాటిన మహిళల్లో 90 శాతం మందికి ఎగ్స్ అంతగా ఉత్పత్తి కావు, ఒకవేళ అయినా.. హెల్తీయర్‌గా ఉండవు. అందుకే 70 శాతం వరకు 35 సంవత్సరాల వయసున్న మహిళలే ‘ఎగ్ ఫ్రీజింగ్’‌ను ఉపయోగించుకుంటున్నారని కొరియాకు చెందిన చా మెడికల్ గ్రూప్ వెల్లడించింది.

అమెరికా, యూరప్‌లో ‘ఎగ్ ఫ్రీజింగ్’ ఇప్పుడు పాపులర్ ఆప్షన్‌గా మారింది. ప్రముఖ కంపెనీలైన ఆపిల్, ఫేస్‌బుక్, గూగుల్ కంపెనీలు అక్టోబర్‌లో తమ మహిళా ఉద్యోగులు ఎవరైతే అండాలను భద్రపరుచుకోవాలనుకుంటున్నారో, వారికి మెడికల్ బెన్‌ఫిట్స్ కోసం 20 వేల డాలర్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ‘ఎగ్ ఫ్రీజింగ్’ గురించి ఎంతోమంది తెలుసుకోవడం మొదలుపెట్టారు. ప్రజల్లో ‘ఎగ్ ఫ్రీజింగ్’పై అవగాహన తెచ్చేందుకు ఎగ్ బ్యాంక్స్ ‘ఎగ్ ఫ్రీజింగ్ పార్టీస్’ ఇవ్వడం విశేషం. ఇప్పటికే హాలీవుడ్ నటీమణులు ఎమ్మా రాబర్ట్స్, క్రిస్సీ టైజెన్, మైఖెలా కోయెల్, రెబెల్ విల్సన్, కౌట్నీ కర్దాషియన్, ఎమీ స్కూమర్, హాల్సే, ఎమీ హార్ట్, కిమ్ కర్దాషియన్, రిటా ఒరా, ఒలివియా మన్, పారిస్ హిల్టన్ ఖోలోయ్ కర్దాషియన్, సోఫియా వెర్గరాలు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్న వారిలో ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి మోనా సింగ్ కూడా తన అండాలను భద్రపరుచుకుంది. విదేశాల్లో పాపులర్‌గా మారిన ఈ ‘ఎగ్ ఫ్రీజింగ్’ ఇండియాలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది.

ప్రతీ మహిళ ‘మాతృత్వాన్ని’ ఆస్వాదిస్తుంది. కానీ, అందుకు తనకు కాస్త టైమ్ కావాలనుకుంటుంది. జీవితంలో తనకు గుర్తుండిపోయే క్షణాలతోపాటు తనకు గుర్తింపు తెచ్చే పనులను చేయాలనుకుంటుంది. పెళ్లి తర్వాత వచ్చే బాధ్యతలు, పిల్లల్ని కనడం, వారి ఆలనా పాలనా చూసుకోవడంలోనే ఆమె సగం జీవితం గడిచిపోతుంది. ఎన్నో కోరికలతో కొత్త లైఫ్ ప్రారంభించిన ఎందరో మహిళల జీవితాలు ఇలా బాధ్యతల నడుమే కొనసాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ సరికొత్త చరిత్రను రాస్తున్నారు. ప్రతి ఒక్కరికీ తమ తమ లైఫ్ ప్లాన్స్ ఉంటాయి. ఎవరి వ్యక్తిగత జీవితాలు వారివి. అందుకే మహిళల మాతృత్వం విషయంలో వారికి కూడా స్వేచ్ఛను ఇవ్వాల్సిన సమయం వచ్చింది. సంప్రదాయాలను బ్రేక్ చేయడమంటే, వాటిని నాశనం చేయడం కాదు వాటికి కొత్త అర్థాన్నివ్వడం.

Tags:    

Similar News